: 19 ఏళ్ల కల సాకారం చేసుకున్న సౌతాఫ్రికా
ఐదు వన్డేల సిరీస్ లో దక్షిణాఫ్రికా జట్టు బోణీ చేసింది. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో 56 పరుగుల తేడాతో గెలిచి తన 19 ఏళ్ల కలను సాకారం చేసుకుంది. 1993లో శ్రీలంకను వారిగడ్డపై ఓడించిన సఫారీలు మళ్లీ ఇన్నాళ్లకు శ్రీలంకను స్వంత గడ్డపై ఓడించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు డేవిడ్ మిల్లర్(85 నాటౌట్) విరుచుకుపడడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లంక పేలవ ప్రదర్శనతో కేవలం 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో బ్యాటింగ్ కు దిగిన ఆల్ రౌండర్ పెరీరా(65) చుక్కలు చూపించడంతో 168 పరుగులు చేయగలిగింది. దీంతో, సౌతాఫ్రికా 19 ఏళ్ల తరువాత లంక గడ్డపై తొలి వన్డేను గెలిచింది.
ఆద్యంతం రసవత్తరంగా సాగిన మ్యాచ్ లో మిల్లర్ 4 ఫోర్లు 5 సిక్సర్లతో తొలుత మెరుపులు మెరిపించగా, పెరీరా ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రాబిన్ పీటర్సన్ వేసిన 33వ ఓవర్లో తొలి బంతిని స్టాండ్స్ కు తరలించి 6 పరుగులు రాబట్టగా, తరువాతి బంతిని పీటర్సన్ వైడ్ గా వేశాడు, తరువాతి బంతిని మళ్లీ (6) బాదాడు పెరీరా, మూడో బంతి కూడా స్టాండ్స్ దాటింది(6). నాలుగో బంతికీ(6) అదేశిక్ష వేశాడు పెరీరా. ఐదో బంతి బౌలర్ తలమీదుగా (4)బౌండరీకి తరలించాడు. చివరి బంతిని కూడా సిక్సర్ బాదాడు దీంతో వన్డే చరిత్రలో ఎక్కువ పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా పెరీరా రికార్డులకెక్కాడు. అగ్రస్థానంలో గిబ్స్(6,6,6,6,6,6) ఉండగా, అఫ్రిది(4,4,6,6,6,6) మూడో స్థానంలో నిలిచాడు.