: గల్ఫ్ కు పోదాం పద అడుక్కోవడానికి!
రంజాన్ మాసంలో ముస్లింలు తమకు తోచినంత దానం చేస్తుంటారు. దీన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారతీయ బిచ్చగాళ్లు గల్ఫ్ దేశాలకు చెక్కేస్తున్నారు. విజిట్ వీసాలపై వెళ్లి సంచులకు సంచులు డబ్బులు పోగేసుకుంటున్నారట. ఈ నెల రోజుల్లో ఒక్కో బిచ్చగాడు కనీసంగా 6 లక్షల రూపాయల వరకూ సంపాదిస్తాడని అక్కడి అధికారులు చెబుతున్నారు. విజిట్ వీసాలపై వెళ్లి సంపాదించుకున్న బిచ్చపు సొమ్మును హవాలా ఆపరేటర్ల ద్వారా స్వదేశానికి పంపుతున్నారట.
కానీ గల్ఫ్ దేశాలలో బిచ్చమెత్తుకోవడం నిషేధం. పట్టుబడితే భారీగా జరిమానా విధించడంతోపాటు తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు. రంజాన్ మాసం కావడంతో దుబాయ్ లో బిచ్చగాళ్ల ఏరివేత కోసం 20 పోలీసు టీమ్ లు రంగంలోకి దిగాయి. ఇప్పటికే రంజాన్ మాసం ప్రారంభం కాగా, ఈ రెండు వారాల్లో 57 మంది భారతీయ బిచ్చగాళ్లను సౌదీ అరేబియాలో అరెస్ట్ చేశారు. దుబాయ్ లో 29 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉండడం విశేషం. కానీ గుట్టు చప్పుడు కాకుండా నెలరోజుల బిక్షా కార్యక్రమం పూర్తి చేసుకుంటే చాలు.. లక్షాధికారులవడం ఖాయం!