: ఎన్నికల సిబ్బంది నిరసన... ఉపాధ్యాయులు విధులు బహిష్కరిస్తారేమో!
ఎన్నికల సిబ్బంది ఇబ్బందులకు తాళలేకపోతున్నారు. సరైన వసతులు కల్పించడంలేదంటూ మండిపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరులో ఎన్నికల సిబ్బంది సామగ్రి తీసుకోకుండా నిరసనకు దిగారు. అధికారుల తీరుతో ఉపాధ్యాయులు అవాక్కవుతున్నారు.. ఏజెన్సీ టీచర్లను పట్టణాలకు, పట్టణాల టీచర్లను కనీస సదుపాయలు కూడా లేని పల్లెలకు పంపుతున్నారని. అక్కడికి వెళ్లడానికి, వచ్చేందుకు తీవ్ర ప్రయాసపడాల్సి వస్తోందని మండిపడుతున్నారు. వందల కిలోమీటర్ల దూరంలో విధులు కేటాయించే అధికారులు నామమాత్రపు ప్రతిఫలం చెల్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నికలంటే వివాదాలు సర్వసాధారణం. అయినప్పటికీ ఓపికగా విధులు నిర్వర్తించినా వేతనం 800 రూపాయలే చెల్లిస్తున్నారని విమర్శిస్తున్నారు. మండల కేంద్రం నుంచి ఎన్నికల అధికారులే ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. మరి మండల కేంద్రానికి ప్రయాణ భత్యం ఎవరు చెల్లిస్తారని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. తీరా గ్రామాలకు వెళితే అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఉండవని, కనీసం తమను పట్టించుకునే నాథుడే ఉండడని అంటున్నారు. మహిళలైతే వారి బాధలు వర్ణనాతీతమని చెబుతున్నారు. తొలి విడత ఎన్నికల్లో ఓ మహిళ ఎన్నికల విధులు నిర్వర్తిస్తుండగా పురుటి నొప్పులు వచ్చి మార్గమధ్యంలో ప్రసవమై పసికందు ప్రాణాలొదిలింది.
మరెంతో మంది మహిళా టీచర్లు అనారోగ్యంతోనే విధులు నిర్వర్తించాల్సి రావడంతో తమకు విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పోలింగ్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించినవారు అర్ధరాత్రి వరకూ ఎన్నికల బాధ్యతలు అప్పగించేవరకూ మండల కేంద్రాల్లోనే ఉండాల్సి రావడంతో రాత్రివేళల్లో ప్రయాణ సౌకర్యాలు లేక రోడ్లమీదే పడుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. దీంతో మరోసారి ఎన్నికల కమీషన్ ఇలాంటి చర్యలే తీసుకుంటే తాము విధులను బహిష్కరించాల్సి ఉంటుందని ఉపాధ్యాయులు హెచ్చరిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల సిబ్బందికి వెయ్యిరూపాయల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.