: జిల్లా సరిహద్దుల్లో వంద కోట్ల నకిలీ నోట్లు.. కట్టడి చెయ్యండి: యనమల
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కోట్లాది రూపాయల నకిలీ నోట్లు చలామణిలో ఉన్నాయని, దీనిపై విచారణ చేయాల్సిన అవసరముందని టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో ఏటీఎం నిర్వాహకుడి హత్య, కోట్లాది రూపాయల దోపిడీపై సీబీఐ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ కేసులో పలు కోణాలు ముడిపడి ఉన్నాయన్న ఆయన, ఈ వ్యవహారంలో బ్యాంకుల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం, తూర్పుగోదావరి జిల్లా తుని సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 100 కోట్ల రూపాయల విలువ చేసే నకిలీ కరెన్సీ చలామణిలో ఉందన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేస్తే అసలు దొంగలు బయటపడతారని సూచించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో లింగపర్తి మండలంలో లాటరేట్ మైనింగ్ వ్యవహారం.. బినామీలతోనూ, వెయ్యి కోట్ల కుంభకోణంతో సంబంధం ఉన్న అంశమని, అందువల్ల వెంటనే ప్రభుత్వం జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు.