: 'వారి వివరాలు చెప్పండి... 5 లక్షలు తీసుకెళ్లండి'


గుజరాత్ లో ఇష్రత్ జహాన్ ఎన్ కౌంటర్ లో ఆమెతో పాటు మరణించిన మరో ఇద్దరు యువకులకు సంబంధించిన వివరాలు ఎవరైనా తెలియజేస్తే 5 లక్షల రూపాయల బహుమతి అందజేస్తామని సీబీఐ ప్రకటించింది. ఈ మేరకు పత్రికా ప్రకటనను విడుదల చేసింది. అంజాద్ అలీ రాణా, జీషన్ జోహార్ అనే వారిద్దరూ పాకీస్థానీయులని, లష్కరే తోయిబా కుట్రలో భాగంగా మోడీని హత్య చేసేందుకు వచ్చారని గుజరాత్ పోలీసులు చెబుతున్నారు. గుజరాత్ పోలీసులు చెబుతున్నట్టుగా వారికి నిజంగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా? అనే విషయంలో సీబీఐ తన దర్యాప్తు కొనసాగిస్తోంది. కాగా, ఈ ఎన్ కౌంటర్ బూటకమంటూ సీబీఐ తొలి చార్జిషీటును ఈ మధ్యే కోర్టుకు దాఖలు చేసింది.

మోడీ హత్యకు కుట్రపన్నారంటూ 2004 జూన్ 15న ఇష్రత్ జహాన్ ను ముంబైలోని ఆమె ఇంట్లోనుంచి తీసుకువచ్చి మరీ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారని ఆరోపణలొచ్చాయి. అనంతరం ఆమెను హత్య చేశారంటూ మానవ హక్కుల సంఘాల నిరసలకు తోడు, అమెరికాలో పట్టుబడ్డ తీవ్రవాది డేవిడ్ హేడ్లీ వాంగ్మూలం కూడా ఈ కేసును తిరగదోడేందుకు కారణమైంది. అయితే ఇష్రత్ జహాన్ అమాయకురాలని ఆమె కుటుంబం వాదిస్తుండగా, గుజరాత్ పోలీసులు మాత్రం ఆమె తీవ్రవాదేనంటున్నారు.

దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ఆమె హత్యోదంతంపై సమగ్ర విచారణ మొదలు పెట్టింది. అందులో భాగంగా పలువురు పోలీసు అధికారులను విచారించింది. వారి వాంగ్మూలాలు రికార్డు చేసింది. అలాగే ఆమెతోపాటు మరిణించిన వారి వివరాలు లభ్యమైతే ఈ కేసు విచారణ మరింత సులభమవుతుందని భావించిన సీబీఐ వారి వివరాలు తెలిపిన వారికి 5 లక్షల రూపాయల బహుమతి ప్రకటించారు.

  • Loading...

More Telugu News