: సికింద్రాబాద్-తిరుపతి మధ్య త్వరలో డబుల్ డెక్కర్ రైలు
ఇప్పుడు కాదు గానీ, ఓ పది పదిహేను సంవత్సరాల కిందట రాష్ట్ర రాజధానిలో డబుల్ డెక్కర్ బస్సులు దర్శనమిచ్చేవి. ఇప్పుడు వెతికినా ఎక్కడా కనిపించవులెండి. అయితే, అతి త్వరలో డబుల్ డెక్కర్ రైలెక్కే అదృష్టం రాష్ట్ర వాసులకు లభిస్తోంది. అంటే రైలు పెట్టెలపై మరో వరుస పెట్టెలు అన్నమాట. సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు వయా కర్నూలు మీదుగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ డబుల్ డెక్కర్ రైలు రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన సన్నాహాలను రైల్వే అధికారులు ప్రారంభిచారు. డబుల్ డెక్కర్ రైలును ప్రవేశపెట్టాలంటూ రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి చేసిన ప్రతిపాదనకు రైల్వేబోర్డు సానుకూలత వ్యక్తం చేయడంతో ఇది సాకారం అవుతోంది.
డబుల్ డెక్కర్ రైళ్లు ఇప్పటికే ఇతర రాష్ట్రాలలో పట్టాలెక్కాయి. చెన్నై-బెంగళూరు, ముంబై-అహ్మదాబాద్, ఢిల్లీ-జైపూర్ ఇలా పలు మార్గాలలో నడుస్తున్నాయి. వీటిలో బెర్తులు ఉండవు. బోగీల్లో కుషన్లు ఏర్పాటు చేయడం, ఏసీ, విశాలమైన సీటింగ్ సదుపాయం వల్ల సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించడానికి వీలవుతుంది. రైలులో కింది పెట్టెలోంచి పై పెట్టెలోకి వెళ్లడానికి వీలుగా మెట్లు ఉంటాయి. ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో డబుల్ డెక్కర్ రైళ్లు ఎక్కువ మంది అవసరాలను తీర్చడానికి ఉపయోకరంగా ఉంటాయి. మొత్తానికి సికింద్రాబాద్-తిరుపతి మధ్య డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం కానుంది. దీంతో, రాష్ట్రంలోని ఇతర ప్రధాన మార్గాలలోనూ ఇవి రావడానికి మార్గం సుగమం అవుతుంది.