: గురువుకు జేజేలు పలుకుతున్న విరాట్ కోహ్లీ


జింబాబ్వే టూర్లో శుభారంభం చేయడం పట్ల టీమిండియా కుర్ర సారథి విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. కోచ్ డంకన్ ఫ్లెచర్ అపార క్రికెట్ పరిజ్ఞానం సత్ఫలితాలిస్తోందని, అందుకు ఇటీవలి విజయాలే నిదర్శనమని కోహ్లీ చెప్పుకొచ్చాడు. నిన్న హరారేలో జింబాబ్వేతో తొలి వన్డేలో నెగ్గిన అనంతరం ఈ యువకెరటం మీడియాతో మాట్లాడుతూ, కోచ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియా కోచ్ గా ఫ్లెచర్ కొంత కష్టకాలం చవిచూసినా, మొక్కవోని స్థైర్యంతో జట్టును వెన్నంటి ఉన్నాడని కితాబిచ్చాడు. ప్రపంచంలో ఫ్లెచర్ ను మించిన క్రికెట్ మేధావి లేడని అభిప్రాయపడ్డాడు. ఆయన వ్యూహచతురత ఫలితమే తాజా విజయాలని వినమ్రతతో పేర్కొన్నాడు.

కాగా, జింబాబ్వే జాతీయుడైన ఫ్లెచర్ 1983 వరల్డ్ కప్ లో ఆరు వన్డేలు కూడా ఆడాడు. ఆ టోర్నీలో 191 పరుగులు, 7 వికెట్లు తీశాడు. ఇక, ఇంగ్లండ్ జాతీయ జట్టుకు కోచ్ గా వ్యవహరించిన తొలి విదేశీయుడూ ఫ్లెచరే కావడం విశేషం. ఫ్లెచర్ వ్యూహాలతోనే ఆసీస్ యాషెస్ విజయ పరంపరకు ఇంగ్లండ్ అడ్డుకట్ట వేయగలిగింది.

ఇక 2011లో టీమిండియా కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన ఈ 64 ఏళ్ళ మాస్టర్ బ్రెయిన్.. రెగ్యులర్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఎంతో ఇష్టుడు. ఫ్లెచర్ డ్రెస్సింగ్ రూంలో ఉంటే, గేమ్ ప్లాన్ గురించి మల్లగుల్లాలు పడాల్సిన అవసరం లేదంటాడు ధోనీ. సాంకేతికపరమైన అంశాలన్నీ ఆయనకు వదిలేసి ఆటపై దృష్టి పెడతానని ధోనీ పలుమార్లు చెప్పాడు.

  • Loading...

More Telugu News