: ఇలాచేస్తే దోమల కంటికి మనుషులు మాయం


దోమల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. దోమల బారినుండి తప్పించుకోవడానికి మనం మందులు, మస్కిటో బ్యాట్‌లు ఇలా ఎన్ని వాడినా కూడా వాటి సంఖ్య మాత్రం పెరిగిపోతోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే, దోమలకు మనం కనపడకుండా చేసే ఒక కొత్తరకం పట్టీని శాస్త్రవేత్తలు తయారు చేశారు. ఈ పట్టీ దోమలు మనల్ని గుర్తుపట్టకుండా చేస్తుందట. దీంతో మనం దోమల బారినుండి ఎంచక్కా తప్పించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు దోమల బారినుండి రక్షణ కల్పించే ఒక సరికొత్త సాంకేతిక పట్టీని తయారు చేశారు. ఈ పరిశోధనను భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఆనంద్‌ శంకర్‌ రే తొలిసారిగా చేపట్టారు. ఈ పట్టీ పేరు కైట్‌ టీఎం మస్కిటో ప్యాచ్‌. ఇది చూసేందుకు చిన్న బొట్టుబిళ్లలాగా ఉంటుంది. ఈ పట్టీని ధరిస్తే 48 గంటలపాటు దోమల నుండి మనకు రక్షణ లభిస్తుందట. సాధారణంగా దోమలు మనుషులు విడుదల చేసే కార్బన్‌డయాక్సైడ్‌ను పసిగట్టడం ద్వారా మనుషులను గుర్తిస్తాయి. అయితే ఈ కొత్తరకం పట్టీ కొన్ని రసాయనాలను విడుదల చేస్తూ దోమలు మనుషులను గుర్తుపట్టే సామర్ధ్యాన్ని అడ్డుకుంటుంది. ఫలితంగా అవి మనుషులను చూడలేవు.

ఈ పట్టీని ఓల్‌ ఫ్యాక్టరీ సంస్థ ఉత్పత్తి చేసింది. దోమల ద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ వంటి జబ్బుల నివారణలో ఇది చాలా చక్కగా తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చవకగా లభించే ఈ పట్టీని పిల్లలు, గర్భిణులు ఇలా అందరూ కూడా తమ దుస్తులపై కూడా ఎక్కడైనా అంటించుకోవచ్చు. చాలా సంవత్సరాలుగా పరిమళ అణువులపై జరుగుతున్న పరిశోధనను సమ్మిళితం చేసి ఈ కైట్‌ పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇందులో ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన హానికరంకాని రసాయనాలనే ఉపయోగించారు. ప్రస్తుతం తక్కువ ధరకు లభించే, దోమలను తరిమేసే ఉత్పత్తులకు ఇది ప్రత్యామ్నాయం కాగలదని ఓల్‌ ఫ్యాక్టరీకి చెందిన మైఖేల్‌ బ్రౌన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News