: ఆకతాయి వేధింపులు... రైల్లోంచి దూకేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్
హౌరా రైల్వే స్టేషన్లో కదిలే రైలులో ఓ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను ఓ పోకిరీ వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తుండడంతో.. ఆ టెకీ కదులుతున్న రైల్లోంచి దూకేసింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయాలయ్యాయి. మహిళలకు కేటాయించిన కంపార్టుమెంటులోకి ప్రవేశించిన ఆ పోకిరీ కన్ను ఈ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై పడడంతో ఆమెను వేధించడం మొదలెట్టాడు. అది భరించలేక, భయంతో ఆ అమ్మాయి హౌరా స్టేషన్ నుంచి పది కిలోమీటర్ల దూరం వెళ్లాక బయటకు ఉరికేసింది. గాయాలతో రైల్వే ట్రాక్స్ పై పడివున్న ఆమెను స్థానికులు చూసి, ఆసుపత్రిలో చేర్చారు. ఈ సంఘటన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దృష్టికి వెళ్ళడంతో ఆమె బాధితురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడడమే కాకుండా, ఆమెకయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా వుంది. ఆ పోకిరీగాడిని తాను గుర్తుపట్టగలనని ఆమె పోలీసులకు తెలిపింది. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.