: మన ఇళ్ళలో ఈ రసాయనం ప్రమాదకరం..బీహార్ బాలల మరణానికి కారణం ఇదే!
46 దేశాల్లో నిషేధించిన రసాయనం మన ఇళ్లలో ఉంది. క్రిమి సంహారక మందుగా ఉపయోగపడే ఈ రసాయనం మార్కెట్లో సులువుగా దొరుకుతుంది. దీంతో ఇది పత్తి పండించే ప్రతి ఇంట్లోనూ ఉంది. 'మోనో క్రోటోఫాస్' పత్తి పండించే ప్రతి వారికీ సుపరిచితమైన పేరు. ఇది దేశంలోని అన్ని ఎరువుల దుకాణాల్లోనూ లభ్యమవుతుంది. కానీ, దీన్ని 46 దేశాలు నిషేధించాయంటే నమ్మగలరా?.. నిజమే దీన్లో విషపూరిత రసాయనాలు ఉన్నాయి. కేవలం ఐదు గింజల పరిమాణం మందు చాలు మనిషి నిండు ప్రాణాన్ని హరించడానికి. వాడేసిన ఖాళీ డబ్బాలను పారేయడం కూడా ప్రమాదమే అంటే ఊహించండి ఇదెంత ప్రమాదకరమో!
2009లోనే ఐక్యరాజ్యసమితి దీన్ని నిషేధించమని మన దేశాన్ని కోరింది. దానికి సమాధానంగా ఆహార పంటలమీద దాన్ని వాడకూడదని ఆదేశాలిచ్చామని చెప్పి ఊరుకుంది మన ప్రభుత్వం. దీని ప్రభావం గురించి తెలియాలంటే, తాజాగా బీహార్ లో మధ్యాహ్న భోజనం తిని మరణించిన 23 మంది పిల్లల్లో దీని అవశేషాలు లభించాయి. వారికి నూనె తెచ్చిన డబ్బా మోనో క్రోటోఫాస్ దే. అది బాగా కడిగి ఉపయోగించినా వారు అసువులు బాసారు. ప్రభుత్వం ఆదేశాలిచ్చామంటోంది కానీ, ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకునేదెవరు? అందుకే రైతులు మిరప, కూరగాయలు, బత్తాయి వంటి పంటల్లో వచ్చే క్రిములను సంహరించేందుకు దీన్ని విరివిగా వాడుతున్నారు. మామిడి పండ్ల సీజన్లో అయితే డబ్బాలకు డబ్బాలు విక్రయిస్తామని లక్నోలోని వ్యాపారులు చెబుతున్నారు.
లక్నో చుట్టుప్రక్కల ప్రాంతాల్లో పర్యటించిన నిపుణులకు లెక్కలేనన్ని మోనోక్రోటోఫాస్ డబ్బాలు కన్పించాయట. అంతటితో ఆగలేదు. ఈ డబ్బాలు పేదలు కడుక్కుని వాడడం మామూలే. అంటే దీనివల్ల ఎంత నష్టం జరిగి ఉంటుందో, ఎంత మంది అంతుచిక్కని వ్యాధుల బారిన పడుతున్నారో అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ మన భారతావని!