: పాతకాలం భాష వల్లే సమస్య
మనం పాతకాలం నాటి భాష మాట్లాడుతున్నామా... లేదుకదా... మనం ఎప్పటికప్పుడు మన భాషను మార్చుకుంటూ వస్తున్నాం. అయితే మనం వాడే సెల్‌ఫోన్లలో మాత్రం పాతకాలం నాటి భాషే ఉంది. దీనివల్లే మన సెల్‌ఫోన్‌లో దొంగలు పడుతున్నారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా సెల్‌ఫోన్ హ్యాకింగ్ సమస్య ఎక్కువగా ఉంది. దీనిపై అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తలు పాతకాలం నాటి భాషను వాడడం వల్లే ఈ సమస్య ఎక్కువగా ఉందని తేల్చారు.
అమెరికాలోని సాంకేతిక నిపుణుడు కర్ట్సెన్‌నోల్ నేడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెల్‌ఫోన్ హ్యాకింగ్ సమస్యపై అధ్యయనం జరిపారు. ఈ అధ్యయనంలో తేలిన విషయం ఏమంటే మనం వాడే సెల్‌ఫోన్లు మాత్రం ఆధునిక రూపంతో ఉన్నాయి. అయితే వాటిలోని భాష మాత్రం పాతకాలానికి చెందినదే ఉంది. దీంతో హ్యాకర్లు సులభంగా మన ఫోన్లలోకి వచ్చేసి, మన సమాచారాన్ని దొంగిలించేస్తున్నారట. ఇప్పటి ఫోన్లలో ఉన్న సంకేత భాష 40 ఏళ్ల క్రితం నాటిది. ఈ భాష ఇప్పటి ప్రమాణాలకు సరిపోదు. మనం వాడే సెల్‌ఫోన్లలో ఉండే ప్రతి సిమ్ కార్డులోను ఒక నిక్షిప్తం సందేశం ఉంటుంది. మనం సిమ్‌ద్వారా జరిపే సంభాషణలు, పంపించే సందేశాలు ఇతరులకు వెల్లడి కాకుండా ఈ నిక్షిప్త సందేశం భద్రపరుస్తుంది. అయితే ఈ సందేశం 1970 నాటిదని నోల్ తన అధ్యయనంలో కనుగొన్నారు. దీంతో పెరిగిన ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేవలం రెండు నిముషాల్లోనే సిమ్‌లో నిక్షిప్తమైవున్న సందేశాన్ని ఛేదించవచ్చని నోల్ నిరూపించారు. ప్రస్తుతం కొందరు సెల్ ఆపరేటర్లు ఆధునిక సంకేత భాషను ఉపయోగిస్తున్నప్పటికీ చాలా సంస్థల్లో పాతకాలం నాటి భాషే వాడుతున్నారని, ఇలాంటి సంస్థలు ఆధునిక సంకేత భాషకు మారాలని నోల్ సూచిస్తున్నారు. ఈనెల 31న అమెరికాలో జరగనున్న బ్లాక్‌హ్యాట్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో నోల్ తన పరిశోధన గురించి వివరించనున్నారు.