: అలవాట్లు ఆహారానికి రుచినిస్తాయట
మనం అనుకోకుండా పాటించే కొన్ని రకాల అలవాట్లు మనం తినే ఆహారానికి రుచినిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనకు తెలియకుండానే మనం మన ఆహారాన్ని తీసుకునే సమయంలో కొన్ని అలవాట్లను పాటిస్తాం. అయితే ఇలాంటి అలవాట్ల వల్ల మనం తీసుకునే ఆహారం రుచి పెరుగుతుందని శాస్త్రవేత్తలు తాజాగా నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది.
మిన్నెసోటా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు శాస్త్రవేత్తలు మనం భోజనానికి ముందు పాటించే కొన్ని రకాల అలవాట్లు, సంప్రదాయాల వల్ల మనం తీసుకునే ఆహారానికి రుచి పెరుగుతుందని, కాబట్టి ఇలా మనం అనుకోకుండా పాటించే సంప్రదాయాలను తేలికగా తీసుకోవద్దని చెబుతున్నారు. సాధారణంగా పుట్టినరోజున మనం కేక్‌ను కట్ చేసేముందు క్యాండిల్‌ను వెలిగించి దాన్ని ఆర్పిన తర్వాత కేక్‌ను కట్ చేస్తాం. ఇలా చేయడం వల్ల కేక్ రుచి పెరుగుతుందని పరిశోధకుల బృందానికి సారధ్యం వహించిన కేథలీన్ వోప్స్‌ా చెబుతున్నారు. అంతేకాదు చాలామంది కాఫీ తెప్పించుకున్న తర్వాత ఎదురుగా ఉండే పంచదారను కొంత పరిమాణంలో కాఫీలో వేసుకుని తర్వాత దాన్ని రుచి చూస్తారు. తర్వాత సరిపోలేదనిపిస్తే పొట్లంలో ఉండే చక్కెరను వేసుకుంటారు. అప్పుడు కాఫీకి కొత్త రుచి రావడంతో దాన్ని ఎంచక్కా లాగించేస్తారు.
ఇలాంటి పనులు మనకు కాస్త చిత్రంగానే అనిపించినా అలాంటి పనులే మనం తినే పదార్ధాలకు రుచినిస్తాయని కేథలీన్ చెబుతున్నారు. ఇందుకుగాను వీరు కొందరిని ఎంపిక చేసుకుని వారికి చాక్లెట్లను ఇచ్చి నాలుగు రకాలుగా పరీక్షించి ఈ విషయాన్ని కనుగొన్నారు. అలవాటు ప్రకారం మనం పాటించే కొన్ని పనులు ఆహారానికి మరింత రుచినిస్తాయని ఈ పరిశోధన ద్వారా కనుగొన్నట్టు కేథలీన్ చెబుతున్నారు.