: 'ప్రేమ' హత్యల్లో మనరాష్ట్రమే టాప్
ప్రేమ లేదా లైంగిక సంబంధాల కారణంగా జరిగే హత్యల్లో, దేశంలోకెల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని వెల్లడైంది. 2001 నుంచి 2012 మధ్య కాలంలో రాష్ట్రంలో ఇలాంటి హత్యలు 4,901 జరిగాయని జాతీయ నేర గణాంకాల నమోదు సంస్థ(ఎన్ సీఆర్బీ) వెల్లడించింది. 4,200 హత్యలతో ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో నిలిచింది. దేశంలో హత్యలకు ఆస్తుల వివాదాలు, ప్రేమ వ్యవహారాలు లేదా లైంగిక సంబంధాలు, ఉన్మాదం, కుటుంబ, వ్యక్తిగత కక్షలు, వరకట్నం, మత తత్వం, కులతత్వం, ఘర్షణలు, రాజకీయ విభేదాలు, ఉగ్రవాదం / వేర్పాటు వాదం కారణాలుగా గుర్తించింది. వీటిలో ఆస్తుల విభేదాలు, కుటుంబ కక్షలు లేదా శత్రుత్వం వల్లే ఎక్కువ శాతం హత్యలు జరిగాయని తేల్చింది.
ఆస్తుల విభేదాల కారణంగా జరిగే హత్యల్లో బీహార్ టాప్ లో ఉంది. ఇక్కడ దశాబ్దకాలంలో ఇలా 9,909 మంది ప్రాణాలు కోల్పోయారు. వేర్పాటువాదం/ఉగ్రవాదం హత్యల్లో జమ్మూకాశ్మీర్ 4,695 హత్యలతో ప్రథమస్థానంలో ఉంది. వ్యక్తిగత కక్షల వల్ల ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 6,156 ఖూనీలు జరిగాయి.