: కమలం గూటికి యాంకర్ ఉదయభాను?
ప్రముఖ బుల్లితెర యాంకర్ ఉదయభాను కమలం గూటికి చేరనుందా? రానున్న 2014 సాధారణ ఎన్నికల్లో సొంత జిల్లా కరీంనగర్ నుంచి పోటీ చేయనుందా? వరస చూస్తుంటే వాస్తవమేనని తెలుస్తోంది. వచ్చేనెల 11వ తేదీన హైదరాబాదు ఎల్ బీ స్టేడియంలో జరగనున్న గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ సభలోనే భాను బీజేపీ తీర్ధం పుచ్చుకోనుందని ఆ పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ జిల్లా కరీంనగర్ నుంచి ఆమెను బరిలోకి దింపి, టీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
అయితే, కొన్నిరోజుల కిందట ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనను రాజకీయాల్లోకి రావాలంటూ ఒక పార్టీ సంప్రదించిన మాట నిజమేనన్నారు. అయితే, ఆ పార్టీ పేరు చెప్పేందుకు మాత్రం ఆమె నిరాకరించారు. కాగా, ఉదయభాను ఓ పార్టీలో చేరబోతోందంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యాయి.