: లైట్లయందు ఇంటెలిజెంట్‌ లైట్లు వేరయా


అదేంటి, ఇలాంటి పద్యం ఎవరూ చెప్పలేదే అనుకోకండి... మనమే చెప్పేసుకుందాం... మరైతే ఇంటెలిజెంట్‌ లైట్లేంటి అనేగా మీ అనుమానం... అవునండీ, లైట్లకు కూడా తెలివితేటలు ఉంటాయి. అవికూడా మనుషులు ఉన్న సమయంలోనే వెలుగుతాయి. మనుషులు లేకుంటే వెలగవు. 'అవును' అనే సినిమాలో మనుషులు గదిలోకి వస్తేనే లైట్లు వెలుగుతాయి... గుర్తుందా... అలాగే ఈ లైట్లు కూడా మనుషులు లేదా వాహనాలు వస్తేనే వెలుగుతాయి. లేకుంటే ఆరిపోతాయి. దీనివల్ల వృధాగా లైట్లు వెలిగి, విద్యుత్తు వృధాను అరికట్టవచ్చు. ఇలాంటి లైట్లను మనదేశానికి చెందిన శాస్త్రవేత్త రూపకల్పన చేశారు.

భారతీయ సాంకేతిక నిపుణుడు చింతన్‌ షా నెదర్లాండ్స్‌లో విద్యార్ధిగా ఉండగా ఒక ఆలోచన వచ్చింది. వీధి దీపాలు రాత్రి పూట అనవసరంగా వెలుగుతుంటాయి. మనుషులు లేకున్నా కూడా అవి వెలుగుతుంటాయి. అలాకాకుండా ఎవరూ వీధిలో లేనపుడు అవి ఆరిపోవచ్చుకదా... ఇలా మనుషులు లేని సమయాల్లో వెలగడం వల్ల ఎంత విద్యుత్తు వృధా అవుతోందని విద్యార్ధి దశలోనే చింతన్‌ ఆలోచించాడు. ఇలా విద్యార్ధి దశలో మొలకెత్తిన ఆలోచన తర్వాత కాలంలో తాను చదివిన సాంకేతిక విద్య తోడ్పాటు తోడై కొత్తరకం లైట్లను తయారు చేసేందుకు సహకరించింది. చింతన్‌ రూపొందించిన లైట్లు మనుషులు లేని సమయాల్లో ఆరిపోతాయి. దీనివల్ల రాత్రి పూట విద్యుత్తు దీపాలకోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, అలాగే లైట్లు వెలగడం వల్ల వెలువడే కర్బన ఉద్గారాలు 80 శాతం తగ్గుతాయని చింతన్‌ చెబుతున్నాడు. ఈ కొత్త రకం'ట్విలైట్‌' విధానం వల్ల ప్రభుత్వానికి మెయిన్‌టెనెన్స్‌ ఛార్జీలు కూడా మరో 50 శాతం మేర తగ్గుతాయని చెబుతున్నారు. ఇవి వైర్‌లెస్‌ సెన్సార్‌ సహాయంతో పనిచేస్తాయట. చింతన్‌ తయారు చేసిన ఇలాంటి వీధి దీపాలను ఇప్పటికే హాలెండ్‌, ఐర్లాండ్‌లో ఏర్పాటు చేశారు. మన భారతదేశంతో సహా, జపాన్‌, అమెరికా, టర్కీ, ఆష్ట్రేలియా వంటి దేశాలు ఈ దీపాల కొరకు వాకబు చేస్తున్నాయని చింతన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News