: గజల్ శ్రీనివాస్ 'గాంధీ' విధేయత!


శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఢిల్లీ నుంచి వచ్చిన విమానం ల్యాండ్ అయింది. "ప్రయాణికులకు విజ్ఞప్తి. ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండయ్యాం. బయట ఉప్ణోగ్రత ఎంతుందంటే....'' అంటూ ఎయిర్ హోస్టెస్ ప్రకటన చేస్తోంటే, గట్టిగా అరుస్తూ ఒకాయన అడ్డు తగిలాడు. "హెలో... ఇది శంషాబాద్ విమానాశ్రయం కాదు. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్. మీ ప్రకటనను సవరించి మళ్లీ చెప్పండి. కొన్ని ప్రదేశాలకు గొప్పవారి పేర్లు పెట్టింది వారి పేరుతో పిలించేందుకే" అంటూ క్లాస్ పీకాడు. అది నిజమేనని నాలుక్కరుచుకున్న ఎయిర్ హోస్టెస్ "సారీ .... మీరు చెప్పింది అక్షరాలా వాస్తవం... మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగాం" అంటూ బుద్దిగా ప్రకటన చేసింది.

ఇంతకీ ఆ ఎయిర్ హోస్టెస్ కు గీతాబోధన చేసింది ఎవరో కాదు... మూడుసార్లు గిన్నిస్ రికార్డు కొట్టిన గజల్ శ్రీనివాస్! పాపం ఫ్లయిట్ లో అంతమంది ప్రయాణికులు ఉండగా ఒక్క గజల్ శ్రీనివాస్ కే ఎందుకు కోపమొచ్చింది? అనే దానిలో ఓ లాజిక్ ఉంది. గజల్ శ్రీనివాస్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి అందరికీ తెలిసిందే.

కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ నామస్మరణలు అందరికీ తెలిసినవే కదా. చిత్రమేమిటంటే అదే విమానంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు వీ హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నేత వంశీరెడ్డి తదితరులు ఉన్నారు. నిన్నగాక మొన్న కాంగ్రెస్ లో చేరిన గజల్ శ్రీనివాస్ గాంధీ కుటుంబ పట్ల వీరాభిమానంలో వారి కంటే రెండాకులే ఎక్కువే చదివినట్టు తన చర్యతో నిరూపించారు.

  • Loading...

More Telugu News