: రేపటి నుంచి భారత్-ఆస్ట్రేలియా తొలి టెస్టు


క్రికెట్లో మరో రోమాంచక సమరానికి రంగం సిద్ధమైంది. నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా రేపు చెన్నయ్ లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్టు జరగనుంది. ధోనీ సారథ్యంలోని భారత జట్టు సొంతగడ్డ అనుకూలతను సొమ్ము చేసుకుని స్పిన్ తో కంగారూల పనిబట్టాలని భావిస్తుండగా.. భీకర పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి మెడలు వంచాలని ఆసీస్ తలపోస్తోంది.

అయితే ఇటీవల కాలంలో భారత్ సొంత గడ్డపై కూడా పరాజయాల బాటలో పయనిస్తుండడం కొంచెం ఆందోళన కలిగిస్తోంది. సచిన్, సెహ్వాగ్, కోహ్లీ, పుజారాలతో టాప్ ఆర్డర్ బలంగానే కనిపిస్తున్నా, నిలకడ లేమి వేధిస్తోంది. బౌలింగ్ లో ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ లు కొత్త బంతిని పంచుకునే అవకాశం ఉంది. స్పిన్నర్లలో హర్భజన్ కు తుది జట్టులో చోటు ఖరారైనట్టు తెలుస్తోంది.

గత సిరీస్ లో పెద్దగా ప్రభావం చూపని అశ్విన్ ఆసీస్ పై సత్తా చాటాలని తహతహలాడుతున్నాడు. ఇక ఆస్ట్రేలియా విషయానికొస్తే, విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ మ్యాచ్ ఫిట్ నెస్ సాధించడం కెప్టెన్ క్లార్క్ కు ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే, ఎడమచేతి వాటం వార్నర్ కు భారత పిచ్ లపై ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. అయితే ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ గాయం కారణంగా కేవలం బ్యాటింగ్ కు మాత్రమే పరిమితం కానుండడం ఆసీస్ అవకాశాలపై ప్రభావం చూపనుంది.

బౌలింగ్ లో తాజా సంచలనం మిచెల్ స్టార్క్, జాన్సన్, సిడిల్ లు భారత్ టాపార్డర్ పనిబడితే కనుక మ్యాచ్ పై పట్టు బిగించవచ్చని ఆసీస్ శిబిరం భావిస్తోంది. స్పిన్ కు అనుకూలించే పిచ్ లపై లియాన్ రాణించాలని కంగారూలు ఆశిస్తున్నారు. ఇక ఎప్పట్లానే చెన్నయ్ పిచ్ స్పిన్ కే అనుకూలిస్తుందని సమాచారం.

  • Loading...

More Telugu News