: అరుణగ్రహం అప్పుడెలా ఉండేదంటే...
ఒకప్పుడు అరుణగ్రహం ఎలా ఉండేది? అనే విషయాలను తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నాసా అంగారకుడి పైకి పరిశోధనలను నిర్వహించేందుకు రోవర్లను కూడా పంపింది. తాజాగా ఈ రోవర్లలో ఒకటైన క్యూరియాసిటీ రోవర్ అరుణుడికి సంబంధించిన కొన్ని కచ్చితమైన లెక్కలతో కూడిన వివరాలను పంపింది. దీనిని బట్టి ఒకప్పుడు అరుణగ్రహంపై వాతావరణం ఎలా ఉండేది? అనే విషయంలో శాస్త్రవేత్తలు అంచనాలు వేస్తున్నారు.
అరుణగ్రహంపై పరిశోధనలకు అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) పంపిన రోవర్ క్యూరియాసిటీ ఆ గ్రహంపైన ఉన్న వాతావరణంలోని పదార్ధాలకు సంబంధించి తొలిసారిగా అత్యంత కచ్చితమైన లెక్కలు వేసింది. ఈ లెక్కల ప్రకారం అరుణగ్రహంపై ఒకప్పుడు చాలా దట్టమైన వాతావరణం ఉండేదని తేలింది. ప్రస్తుతం అరుణగ్రహం చాలా పలుచటి వాతావరణంతో కూడుకుని ఉంది. ఒకప్పుడు మాత్రం చాలా దట్టమైన వాతావరణంతో ఉన్న అరుణగ్రహం ఇప్పుడు ఇలా మారడానికి కారణాలు తెలుసుకునేందుకు అవసరమైన ఆధారాలు కూడా ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలకు లభించనున్నాయి.
క్యూరియాసిటీ రోవర్‌లోని అత్యంత కీలకమైన శాంపిల్ అనాలసిస్ ఎట్ మార్స్ (శామ్) అనే పరికరం ఆ గ్రహంపైని వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందించింది. ఇప్పుడు అంగారకుడిపై వాతావరణంలో కార్బన్‌డై ఆక్సైడ్ అధికంగా ఉంది. ఈ వాయువులోని కార్బన్, ఆక్సిజన్ ఐసోటోపుల నిష్పత్తిని శామ్ పరికరం విశ్లేషించింది. గ్రహాన్ని ఏర్పరచిన ముడిపదార్ధంలోని నిష్పత్తులతో పోలిస్తే ప్రస్తుతం వాతావరణంలో ఉన్న కార్బన్, ఆక్సిజన్‌లకు సంబంధించిన భార ఐసోటోపులు అధికంగా ఉన్నాయని, దీన్ని బట్టి అంగారకుడు ఒకప్పటి తన అసలు వాతావరణాన్ని కోల్పోయాడని శాస్త్రవేత్తలు నిర్ధారణకు వచ్చారు. ఎగువ వాతావరణం కారణంగానే ఈ నష్టం సంభవించి ఉంటుందని శాస్త్రవేత్తలు వివరించారు.
ఈ పరిశోధన బృందంలో భారత సంతతికి చెందిన సుశీల్ ఆత్రేయ అనే శాస్త్రవేత్త కూడా ఉన్నారు. ఈ విషయాన్ని గురించి ఆత్రేయ మాట్లాడుతూ, ఒకప్పుడు అంగారక గ్రహంపై దట్టమైన వాతావరణం, ఉష్ణం, తేమతో కూడిన పరిస్థితులు ఉండేవని ఈ అంచనాల వల్ల స్పష్టమవుతోందని అన్నారు.