: ఈ స్పాంజి చాలా తెలివైంది
స్పాంజికి తెలివితేటలు ఉంటాయా...? అని మీరు ఆశ్యర్యపోతున్నారా... అయితే ఇది మామూలు స్పాంజి కాదులెండి. షుగరు వ్యాధిగ్రస్తులకు ఉపయోగించే స్పాంజి. అయినా స్పాంజికి తెలివితేటలు ఎక్కడివి అనేగా మీ అనుమానం... అయితే ఈ స్పాంజి చేసే పనులు అలాగే ఉంటాయి మరి. ఎందుకంటే ఇది మధుమేహ రోగుల శరీరంలోని గ్లూకోజు స్థాయిలను బట్టి ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. కాబట్టి ఇది తెలివైన స్పాంజి అని చెప్పాలి. ఇలాంటి ఇంటెలిజెంట్ స్పాంజిని శాస్త్రవేత్తలు రూపొందించారు.
నార్త్ కరోలీనా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఝెన్ గు నేతృత్వంలో శాస్త్రవేత్తలు ఒక కొత్తరకం స్పాంజిని ఉత్పత్తి చేశారు. ఈ స్పాంజిని పీతలు, చిన్న రొయ్య పెంకులో ఉండే చిటోసాన్ అనే పదార్ధం నుండి తయారు చేశారు. ఇందులో ఉండే చిన్న చిన్న రంధ్రాలతో కూడిన పాలిమర్‌తో చేసిన అతి సూక్ష్మమైన గొట్టాలు ఉంటాయి. ఈ గొట్టాలలో గ్లూకోజు ఆక్సిడేజ్ లేదా రసాయనిక చర్యను వేగవంతం చేసే ఎంజైములను కూరుస్తారు. అలాగే ఈ స్పాంజిలో ఇన్సులిన్‌ను కూడా జొప్పిస్తారు. షుగరు వ్యాధి ఉన్న వారిలో గ్లూకోజు మోతాదు పెరిగినపుడు స్పాంజి ఉబ్బి ఇన్సులిన్ రక్తంలోకి విడుదల అవుతుంది. అలాగే గ్లూకోజు మోతాదులు తగ్గినపుడు స్పాంజి చిన్నగా అయ్యి రక్తంలోకి ఇన్సులిన్ విడుదల ఆగిపోతుంది. ఈ కొత్త రకం స్పాంజి గురించి ఝెన్ గు మాట్లాడుతూ, చిటోసాన్ శరీరంలో కలిసిపోతుంది. కాబట్టి దీంతో దీర్ఘకాల దుష్ప్రభావాలు ఉండవని తెలిపారు.