: ఆ ఆసుపత్రి నుంచి రక్షించి, న్యాయం చెయ్యండి: మాజీ సైనికుడి ఆవేదన
తన భార్యను మానసిక వికలాంగురాలిగా తయారు చేసి, బెదిరింపులకు పాల్పడుతున్న ఆసుపత్రి బారి నుంచి తమను రక్షించి.. కోర్టు ఆదేశాల మేరకు తమకు న్యాయం చేయాలంటూ ఓ మాజీ సైనికోద్యోగి హైదరాబాద్ లో మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. బంజారా హిల్స్ కు చెందిన మాజీ సైనికోద్యోగి టీకే స్వామి తన భార్య గుండెనొప్పితో బాధపడుతుండగా ఓ మిత్రుడి సలహా మేరకు చెన్నైలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చేర్పించాడు. వాళ్లు పరీక్షలు చేసి ఆపరేషన్ చేశారు. తరువాత కూడా నొప్పి రావడంతో ఆమెను మరో ఆసుపత్రికి తరలించారు.
అక్కడ పరీక్షలు చేసిన డాక్టర్లు ఆపరేషన్ వికటించిందని తెలిపారు. దీంతో సదరు కార్పోరేట్ ఆసుపత్రిపై కేసు వేయగా కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి ఆసుపత్రి యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చెయ్యాలని కోరారు. దాంతో, కమిషన్ ఆగస్టు 19 లోపు ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని బంజారా హిల్స్ ఏసీపీని ఆదేశించింది.