: అమ్మకానికి పంచాయతీలు... ఖూనీ అయిన ప్రజాస్వామ్యం
ఇప్పుడు దేశంలో ఏ ఇద్దరు మేధావులు కలిసినా ప్రస్తావనకొస్తున్న అంశం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలే. ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన భారత దేశంలో పంచాయతీ సర్పంచి పదవులను డబ్బుకు అమ్ముకున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ వార్తలకెక్కింది. ప్రజాస్వామ్యానికి సమాధి కట్టి, నీతి నిజాయతీల గురించి గంటల తరబడి లెక్చర్లిచ్చే ప్రజల తీరును రచ్చకీడ్చిన దుర్ఘటన మన రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇదే దేశంలో జోరుగా హోరుగా అందరి నోళ్లలో నానుతున్న అంశం. ఇంత గొప్ప ప్రతిష్ఠ తీసుకొచ్చిన పంచాయతీలు అత్యధికంగా గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి.
గుంటూరు జిల్లా శావల్యాపురం పంచాయతీ పదవిని 8 లక్షల 25 వేల రూపాయలకు కొనుక్కుని మహాలక్ష్మి సంచలనం సృష్టించింది. సుమారు 26 పంచాయతీలు అమ్ముడుపోగా అవన్నీ సుమారు 4 లక్షల రూపాయలకంటే ఎక్కువ రేటుకే అమ్ముడయ్యాయి. దీంతో రాజకీయ చైతన్యం కలిగిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరింత ముందడుగు వేసి ప్రజాస్వామ్యానికి గోరీ కట్టారని పరిశీలకులు అంటున్నారు.
దేశంలో అవినీతి ఎక్కువైపోయింది, అధికారులు అవినీతికి పట్టుగొమ్మల్లా తయారయ్యారు, నేతలు అవినీతికి పాల్పడుతూ, అవినీతిని ప్రోత్సహిస్తున్నారని విరుచుకుపడే మన ప్రజానీకం.. ఇప్పుడేమంటుందో. అంగట్లో సరుకులా వేలానికి సర్పంచి అధికారాన్ని అమ్ముకున్న ప్రజలకు.. అభివృద్ధి జరగలేదు అనే అధికారం ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి గ్రామాల్లో సర్పంచులకు ఏకఛత్రాధిపత్యాన్ని డబ్బుతీసుకుని కట్టబెట్టినట్టయిందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ భవిష్యత్తుకు ఇలాంటి చర్యలు హాని చేస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.