: కాక్ పిట్ లో హీరోయిన్.. పైలెట్లపై వేటు
విమానం గాల్లో వెళుతున్న సమయంలో కాక్ పిట్ లోపలకు ఓ దక్షిణాది నటిని అనుమతించిన ఇద్ధరు ఫైలెట్లపై ఎయిర్ ఇండియా వేటు వేసింది. వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేగాక ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాదుకు వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నటీమణిని కాక్ పిట్ లోకి అనుమతించిన పైలెట్లు జగన్ ఎమ్ రెడ్డి, ఎస్ కిరణ్ అని తెలిసింది.
గతనెలలో జరిగిన ఈ ఘటనపై ఓ ప్రయాణికుడు ఎయిర్ లైన్ కు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. అటు ఈ విషయాన్ని డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) కూడా సీరియస్ గా తీసుకుంది. ప్రయాణికుల భద్రత మరచి ఇటువంటి పనులకు పాల్పడ్డ వారిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.