: అత్యాచార నిందితుడికి యూపీలో వింత శిక్ష!
అత్యాచార నిందితుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తెచ్చి, వారికి కఠిన శిక్షలు విధించే ప్రయత్నాలు చేస్తుంటే.. ఉత్తరప్రదేశ్ లో మాత్రం స్వల్ప శిక్షతో గ్రామపెద్దలు వదిలేశారు. ఇక్కడి అలీగఢ్ లోని మాద హబీబ్ పూర్ అనే మారుమూల గ్రామంలో కొన్ని రోజుల కిందట ఓ బాలికపై స్థానికుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆమె కుటుంబం ఈ వ్యవహారాన్ని పంచాయతీ పెద్దలకు మొరపెట్టుకుంది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది.
అంతా విన్న గ్రామ పంచాయతీ పెద్దలు సింపుల్ గా నిందితుడి చెంపపై 'ఐదుసార్లు బూటు దెబ్బలు' కొట్టించి చేతులు దులిపేసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళితే గ్రామం పరువుపోతుందనే ఈ నిర్ణయం తీసుకున్నామని పెద్దలు తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనిపై బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.