: రూ.5 ఇస్తేనే మోడీ సభలోకి ప్రవేశం
ఇదో సరికొత్త ప్రయోగం. సాధారణంగా రాజకీయ సభలకు ప్రవేశరుసుం వసూలు చేయడమన్నది ఉండదు. ఎంత ఎక్కువ మంది ప్రజలు హాజరైతే అంత గొప్పగా నేతలు, పార్టీలు భావించడం చూస్తుంటాం. కానీ, గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నరేంద్ర మోడీ హైదరాబాద్ లో నిర్వహించనున్న సభకు మాత్రం ఎంట్రీ టికెట్ పెట్టారు. ఐదు రూపాయలు పెట్టి కొనుక్కుంటే గానీ మిమ్మల్ని సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టనివ్వరు.
ఆగస్టు 11న లాల్ బహదూర్ స్టేడియంలో మోడీ సభ జరగనుంది. ఇందుకోసం ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లను సోమవారం ప్రారంభించారు. 8,000 మంది తొలిరోజే టికెట్లను బుక్ చేసుకున్నారు. కనీసం 50 వేల నుంచి లక్ష మంది వరకూ సభకు వస్తారని బీజేపీ అంచనా. ఎల్ బీ స్టేడియం ఒక రోజు అద్దె 3.75లక్షల రూపాయలు కాగా, దీనికి విద్యుత్ చార్జీలు అదనం.
టికెట్ల విక్రయం ద్వారా కనీసం 5 లక్షల రూపాయలు వస్తాయని భావిస్తున్నారు. దీంతో అద్దె ఖర్చు తీరిపోతుంది. అంటే ప్రజాసభ ఖర్చును ప్రజలే భరించనున్నారన్నమాట. అయితే, టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చెప్పారు. ప్రస్తుతం టికెట్ల విక్రయం బీజేపీ అధికారిక వెబ్ సైట్ ద్వారా నడుస్తుండగా.. త్వరలో హైదరాబాద్ లో 500 కౌంటర్లు, జిల్లా కేంద్రాలలోనూ మరికొన్ని కౌంటర్లు తెరవాలని భావిస్తున్నట్లు ప్రభాకర్ తెలిపారు.