: నాన్నలు లావైతే పిల్లలకు ప్రమాదం!
నాన్నలు లావుగా ఉంటే వారివల్ల వారి పిల్లలకు కూడా ఇదే ప్రమాదం పొంచి వుందంటున్నారు శాస్త్రవేత్తలు. తండ్రులు ఊబకాయం సమస్యతో బాధపడుతుంటే వారి పిల్లలకు కూడా ఇదే ఊబకాయంతోబాటు మధుమేహం కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆష్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఆష్ట్రేలియాలోని అడిలైడ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక పరిశోధనలో స్థూలకాయుడైన తండ్రి శుక్రకణాల్లోని పరమాణు సంకేతాలు వారి సంతానంలో రెండు తరాల వరకూ మధుమేహం తరహా లక్షణాలనూ, స్థూలకాయాన్ని కలిగిస్తున్నట్టు తేలింది. తండ్రులు ఇలా ఊబకాయం సమస్యతో బాధపడుతుంటే వారి పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నా కూడా వారికి ఇలాంటి సమస్య తప్పడం లేదని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. ఈ విధంగా తండ్రికి, పిల్లలకు మధ్య అనారోగ్యానికి సంబంధించిన లంకెను గుర్తించడం అనేది ఇదే తొలిసారి అని పరిశోధకులు టాడ్ ఫుల్‌స్టాన్ చెబుతున్నారు. తండ్రి ఆహార అలవాట్లు వారి వీర్యంలోని మాలిక్యులర్ మేకప్‌లో మార్పులకు దారితీస్తున్నట్టు టాడ్ వివరించారు. ఊబకాయం కారణంగా తండ్రుల వీర్యం, మైక్రోఆర్‌ఎన్‌ఏ పరమాణువుల్లో మార్పులు తలెత్తడం వల్ల స్థూలకాయం దిశగా పిండంలోనే మార్పులు సంభవించడంగానీ లేదా జీవిత అనంతర కాలంలో జీవక్రియ వ్యాధికి కారణంగానీ కావచ్చని పుల్‌స్టాన్ చెబుతున్నారు. తండ్రికి మధుమేహం లేకున్నా తర్వాత రెండు తరాలకు సంక్రమించే లక్షణం ఉన్నట్టు, ప్రస్తుతానికి ఎలుకలపై ప్రయోగాలు చేపట్టామని, తర్వాత దశలో ఈ విషయం గురించి మనుషులపై కూడా పరిశీలిస్తామని పుల్‌స్టాన్ చెబుతున్నారు.