: టన్నులకొద్దీ మంచు కరిగిపోతోంది
మన భూమిపై అధికభాగం నీటి రూపంలో ఉంది. అందులో మంచు రూపంలోనే ఎక్కువ భాగం ఉంది. అయితే ఈ మంచుభాగం ఏటా తగ్గుతూ వస్తోంది. ఏటా టన్నుల కొద్దీ మంచు కరిగిపోతోందట. ఈ మంచు కరుగుదల ఏ ఏటికాఏడు పెరుగుతూ వస్తోందట. ఈ విషయం శాస్త్రవేత్తల పరిశీలనలో వెల్లడయ్యింది.
గ్రావిటీ రికవరీ అండ్ క్లైమేట్ ఎక్స్‌పరిమెంట్ (గ్రేస్) అనే ఒక ఉపగ్రహం గ్రీన్‌ల్యాండ్, అంటార్కిటిక్‌లో భారీ మంచు ఫలకాల్లో వచ్చే మార్పుల కారణంగా భూమి గురుత్వాకర్షణ క్షేత్రంలో వచ్చే తేడాలను కొలుస్తుంది. ఈ ఉపగ్రహం జరిపిన పరిశీలనలో ఏటా 300 బిలియన్ టన్నుల మేర మంచు కరుగుతూ వస్తోందని తేలింది. దశాబ్దాల కాలంలో ఈ ఉపగ్రహం జరిపిన పరిశీలనలో ఈ విషయం వెల్లడైంది. ఈ ఉపగ్రహం 2002 నుండి ఈ విషయం గురించి పరిశీలించడం మొదలుపెట్టింది. ఏటా మంచు కరుగుదల పరిమాణాన్ని ఇది అంచనా వేసింది. ఈ పరిశీలనలో ఏటా 300 బిలియన్ టన్నుల మంచు కరుగుతోందని ఉపగ్రహం నిర్ధారించింది. ఈ కరుగుదల కూడా ప్రతి ఏడాది పెరుగుతూ వస్తోందని, దీనివల్ల ప్రపంచ వ్యాప్తంగా సముద్ర మట్టాలపై తీవ్ర ప్రభావం పడుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉపగ్రహం పరిశీలన మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటితో పోలిస్తే ఇటీవలే సముద్ర మట్టాలు బాగా పెరిగాయని శాస్త్రవేత్త బెర్ట్ వోటర్స్ చెబుతున్నారు.