: తొంభై ఏళ్ళ ముదుసలికి తొంభై ఏళ్ళ జైలుశిక్ష
బంగ్లాదేశ్ లో యుద్దనేరాలకు పాల్పడ్డాడంటూ కరడుగట్టిన ఇస్లామిక్ వాది గులామ్ అజామ్ అనే 90 ఏళ్ళ వృద్ధుడికి ప్రత్యేక కోర్టు 90 ఏళ్ళ జైలుశిక్ష విధించింది. 1971లో పాకిస్తాన్ నుంచి విడిపోయే సమయంలో చెలరేగిన అల్లర్లకు గులామే కారణమని కోర్టు నిర్ధారించింది. తమ వాదనల సందర్బంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గులామ్ ను జర్మన్ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తో పోల్చారు. అల్లర్లకు ప్రణాళిక రచించడం, కుట్ర, అల్లరిమూకలకు ఆశ్రయం కల్పించడం, ఉద్రిక్త పరిస్థితులు సృష్టించడం, హత్యానేరం వంటి అభియోగాలను గులామ్ పై మోపారు.
బంగ్లాదేశ్ అల్లర్ల సమయంలో మొత్తం 30 లక్షల మంది చనిపోయారని కోర్టుకు వెల్లడించారు. ఆ సమయంలో దేశంలోనే అతిపెద్ద ఇస్లామిక్ పార్టీ జమాత్-ఏ-ఇస్లామికి అధినేతగా ఉన్నా గులామ్ ప్రస్తుతం ఆ పార్టీకి ఆధ్మాత్మిక నేతగా వ్యవహరిస్తున్నారు. కాగా, వయసు పైబడడంతో ఆయనకు మరణశిక్ష విధించకుండా.. 90 ఏళ్ళ జైలుశిక్ష విధిస్తున్నామని న్యాయమూర్తి పేర్కొన్నారు.