: వారు చనిపోయారంటే అంగీకరించను: ఉత్తరాఖండ్ సీఎం
గతనెల ఉత్తరాఖండ్ వరదల్లో గల్లంతైన వారిని మృతులుగా ప్రకటించేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తిరస్కరించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 5,748 మంది వరదల్లో గల్లంతయ్యారని ఆ రాష్ట్ర ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. దీనికి సంబంధించి ఈరోజు మీడియాతో ఏర్పాటు చేసిన సమావేశంలో బహుగుణ మాట్లాడుతూ... విపత్తు సంభవించి నెల రోజులు అయిందన్నారు. గాలింపు, సహాయక చర్యలు పెద్ద ఎత్తున చేపట్టామని అన్నారు. అయినా ఫలితం లేదని, చేస్తున్న ప్రయత్నాన్ని నిలిపివేయలేమని, ఆశను వదులుకోబోమన్నారు. ఇప్పటికీ వారిని గల్లంతైన వారిగానే తాను పరిగణిస్తానని పేర్కొన్నారు. కాగా, మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన రూ.5లక్షల పరిహారాన్ని రేపటి నుంచి చెల్లించడం ప్రారంభిస్తామని తెలిపారు. పరిహారంలో రూ.3 లక్షలు కేంద్ర ప్రభుత్వం, మిగతా మొత్తం ఆయా రాష్ట్రాలే భరిస్తాయన్నారు. అయితే, గల్లంతైన వారు తిరిగివస్తే పరిహారం వెనక్కి తీసుకుంటామని చెప్పారు.