: స్టార్ బ్యాట్స్ మన్ ఎవరో చెబితే బౌలర్ ను తెచ్చుకుంటాం: వీహెచ్
సమైక్యాంధ్రకు మద్దతుగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ తెలంగాణ సీనియర్ నేత వి.హనుమంతరావు తనదైన శైలిలో ప్రతిస్పందించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి స్టార్ బ్యాట్స్ మన్ రంగంలోకి దిగాడని లగడపాటి రాజగోపాల్ రెండు రోజుల కిందట వ్యాఖ్యానించారు. మీడియాతో మాట్లాడుతూ, ఆ బ్యాట్స్ మన్ ఎవరో తర్వాత చెబుతానన్నారు. దీంతో, ఆ స్టార్ బ్యాట్స్ మన్ ఎవరో లగడపాటి రాజగోపాల్ చెబితే తగిన బౌలర్ ను రంగంలోకి దింపుతామని వీహెచ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం కాకుండా ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలంటూ మాట్లాడడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి, అవసరమైతే సీమాంధ్రకే ప్యాకేజీ ఇవ్వాలని హనుమంతరావు అభిప్రాయం వ్యక్తం చేశారు.