: ఇక వాళ్ళు మరణించినట్టే!
ప్రకృతి విలయతాండవంతో వరదల్లో గల్లంతైన వారిని ఇక మృతులుగానే భావించాలని ఉత్తరాఖండ్ సర్కారు నిర్ణయించింది.ఈ మేరకు నేడు అధికారికంగా ప్రకటించనున్నారు. ఉత్తరాఖండ్ సర్కారు గణాంకాల ప్రకారం దాదాపు 5,500 నుంచి 6,000 మంది వరదల్లో తప్పిపోయారని తెలుస్తోంది. ఇప్పటివరకు 18 రాష్ట్రాలకు చెందిన యాత్రికులు చనిపోయారని అధికారులు చెప్పారు. దీనిపై ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రి విజయ్ బహుగుణ మాట్లాడుతూ... మరణించిన వారి వివరాలను ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు పంపినట్లు తెలిపారు.
అయితే, ఉత్తరప్రదేశ్ నుంచి దాదాపు 2వేలు, మధ్య ప్రదేశ్ నుంచి వెయ్యి మంది అత్యధికంగా చనిపోయినట్లు తెలుస్తోంది. ఇక రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా రాష్ట్రాల నుంచి అనేకమంది తప్పిపోయారని సమాచారం. ప్రధానంగా ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్, గౌరికుండ్ ప్రాంతాల్లోనే ఎక్కువమంది మరణించినట్టు తెలుస్తోంది.