: కలహాలకు కారణం అదే!
డబ్బు... ఇది అవసరం లేని వ్యక్తి అంటూ ప్రపంచంలోనే ఉండడేమో. అలాంటి డబ్బు మనుషుల మధ్య చిచ్చు పెడుతుంది. కాపురాలను కూల్చే శక్తి కూడా డబ్బుకుంది అంటున్నారు పరిశోధకులు. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో డబ్బు కాపురాల్లో చిచ్చు పెట్టడంతోబాటు, కాపురాలను కూడా కూల్చేస్తుందని తేలిందని పరిశోధకులు చెబుతున్నారు.
విడాకులకు దారితీసిన కారణాల్లో ఎక్కువగా చెప్పేది డబ్బు. కేవలం డబ్బు కారణంగానే పచ్చని కాపురాల్లో చిచ్చు రగులుకుంటున్నట్టు, ఈ కారణంగానే గొడవలు విడాకుల దాకా వెళుతున్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయన బృందానికి సారధ్యం వహించిన సోన్యా బ్రిట్ మాట్లాడుతూ, విడాకులకు దారితీసిన కారణాల్లో డబ్బు అనేది అగ్రస్థానంలో ఉందని తెలిపారు. ముఖ్యంగా వివాహమైన తొలిరోజుల్లో జరిగే డబ్బుల గొడవలు పచ్చగా సాగాల్సిన సంసారాన్ని విచ్ఛిన్నం చేస్తాయని బ్రిట్ చెబుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తాము నిర్వహించిన విస్తృత అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైందని ఆమె తెలిపారు. సుమారు 4,500 మందికి పైగా దంపతులకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తాము ఈ నిర్ణయానికి వచ్చామని, పిల్లలు, అత్తమామలతో గొడవలు, ఇంకా ఇతర కుటుంబ కలహాలు, దాంపత్య పరమైన ఇబ్బందులు ఇలా ఎన్నో అంశాలు విడాకులకు కారణాలైనప్పటికీ వీటిలో డబ్బు విడాకులకు ప్రధాన కారణమవుతోందని తమ అధ్యయనంలో తేలినట్టు బ్రిట్ చెబుతున్నారు.