: క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు
క్యాన్సర్ వ్యాధి నిర్మూలనకు శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారు. ఈ వ్యాధిని పూర్తిగా నివారించే దిశగా తమ ప్రయోగాలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో క్యాన్సర్ వ్యాధిని నయం చేసే పద్ధతికి కొంత సమీపానికి వచ్చినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము రూపొందించిన కొత్త చికిత్స విధానంతో రోగి శరీరంలోని సొంత రోగనిరోధక వ్యవస్థ కణాలను ఉపయోగించి క్యాన్సర్ కణితిపై పోరాటం సాగించేలా తీర్చిదిద్దినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బ్రిటిష్ కంపెనీ ఇమ్యూనోకోర్‌కు చెందిన పరిశోధకులు రోగ నిరోధక వ్యవస్థకు చెందిన సహజమైన టీ కణాలను ఈ విధంగా తీర్చిదిద్దారు. వీటిని క్యాన్సర్ కణాలతో పోరాటం సాగించేలా తయారు చేసే పరిజ్ఞానం కనుగొన్నారు. ఇమ్యూనోథెరపీ వంటి ఇతర క్యాన్సర్ చికిత్సలకన్నా ఇది విభిన్నమైనదేమీ కాకపోయినా, ఈ చికిత్సలో కొంత ప్రత్యేకత కలిగి ఉందని, ఈ చికిత్సకు క్యాన్సర్‌ను తగ్గించే శక్తి ఉందని బెంట్ జాకోబ్సేన్ చెబుతున్నారు. తాము చేసిన ఈ పరిశోధనలో కనుగొన్న విషయం క్యాన్సర్ కణానికి, ఆరోగ్యవంతమైన కణానికి తేడాను గుర్తించడమేనని బెంట్ చెబుతున్నారు. ఇది తాము సాధించిన కీలక విజయమని బెంట్ అంటున్నారు.