: ఆంధ్రా మీడియా నన్ను తక్కువచేసి చూపుతోంది: కేసీఆర్


గులాబీ బాస్ మౌనం వీడారు. చాన్నాళ్ళుగా ఫాంహౌస్ కే పరిమితమైన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు మళ్ళీ తెరపైకి వచ్చారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో పలువురు పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడుతూ, ఆంధ్రా మీడియా తనను తక్కువ చేసి చూపుతోందని ఆరోపించారు. ఓ పత్రిక చెడు రాతలు మానుకోకుంటే తెలంగాణలో ఆ పత్రికను బహిష్కరిస్తామని హెచ్చరించారు. అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు కేసీఆర్ ను ఏకాకిని చేస్తున్నాయని సదరు పత్రికలో వచ్చిన కథనంపై స్పందిస్తూ.. ఈ ప్రపంచంలో తననెవరూ ఏకాకిని చేయలేరని స్పష్టం చేశారు.

ఇక కాంగ్రెస్ పార్టీ చెబుతూ.. కోర్ కమిటీ, వర్కింగ్ కమిటీ అంటూ కొత్త నాటకాలకు తెరదీస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ మాయామశ్చీంద్ర మోసాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసని, ఆ పార్టీని ఎవరూ నమ్మబోరని అన్నారు. వారం అంటే ఏడు రోజులేనా? అంటూ పిచ్చి లెక్కలు చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్ర బిల్లు ప్రవేశపెడితేనే కాంగ్రెస్ ను విశ్వసిస్తారని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం పోరాడే పార్టీ అని అభివర్ణిస్తూ.. నూటికినూరుపాళ్ళు ప్రత్యేక రాష్ట్రం సాధించడమే తమ లక్ష్యమని నొక్కి చెప్పారు. తెలంగాణలో ప్రతి ఒక్కరూ కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నారని.. ఆఖరికి గిరిజనులు, ఆదివాసీలు తెలంగాణ కావాలంటున్నారని వివరించారు. అరాచకం జరిగిన చోటే ప్రజలు తిరగబడతారంటూ.. ఇక అన్నీ అయిపోయాయని, ఏం చేసినా కథ నడవదని స్పష్టం చేశారు. 'కలిసిపోరాడుదాం, కలిసి తెలంగాణ సాధిద్దాం, ఆత్మగౌరవం నిలబెట్టుకుందాం' అంటూ కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News