: పిల్లల ఏడ్పు విని ఎలా ఉన్నారో చెప్పేయొచ్చు!
సాధారణంగా పసిపిల్లలు ఏడుస్తుంటే అదే వారికి బలం అంటూ మనవాళ్లు అనుకుంటుంటారు. అయితే ఇదే ఏడుపు పిల్లల ఆరోగ్యాన్ని గురించి చెప్పేస్తుందట. వారి ఏడుపులోని శబ్ధాలు వారి ఆరోగ్య సమస్యలను, ఎదుగుదలలోని సమస్యలను కూడా చెబుతాయంటున్నారు శాస్త్రవేత్తలు.
బ్రౌన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక కంప్యూటర్ ఆధారిత ఉపకరణాన్ని తయారు చేశారు. ఈ ఉపకరణం పిల్లల ఏడుపులోని శబ్ధాలను సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తుంది. ఈ విశ్లేషణ ద్వారా వారి ఆరోగ్య సమస్యలను, ఎదుగుదలకు సంబంధించిన సమస్యలను గుర్తించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా పిల్లల ఏడుపుకు సంబంధించి ఎందుకు ఏడుస్తున్నారు? అనే విషయాన్ని మనం గ్రహించలేము. అయితే ఈ ఉపకరణం పిల్లల ఏడుపులోని శబ్ధాల్లో తేడాలను పసిగట్టగలదు.
ఈ ఉపకరణం గురించి బ్రౌన్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టీఫెన్ షీన్‌కోఫ్ మాట్లాడుతూ పిల్లల ఏడుపులోని శబ్దాల తేడాల్లో చాలా రకాల సమస్యలు వ్యక్తమవుతాయని, వాటిని విశ్లేషించడం ద్వారా శిశువు నాడీ సంబంధ సమస్యలతోబాటు ఇతర సమస్యలను కూడా గుర్తించే అవకాశముందని చెబుతున్నారు. ఈ ఉపకరణం రికార్డు చేసిన పిల్లల ఏడుపును 12.5 మిల్లీ సెకండ్లకు ఒక భాగంగా విభజిస్తుంది. ప్రతి భాగంలోనూ వారి ఏడుపు శబ్దాల తీవ్రత, విధానం వంటి వివరాలను విశ్లేషిస్తుంది. అనంతరం అక్కర్లేని శబ్దాలను వేరుచేసి తర్వాత అవసరమైన శబ్దాలను క్రోడీకరిస్తుంది. తర్వాత ఈ భాగాలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి ఉచ్చారణలో తీవ్రత, ఖాళీలు వంటి తేడాల ఆధారంగా వివిధ రకాల సమస్యలను అంచనా వేస్తారు.