: బొత్స.. గురువును 'ముంచిన' శిష్యుడట!
పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత షర్మిల నిప్పులు చెరిగారు. బొత్స.. గురువును మించిన శిష్యుడు కాదని, గురువును ముంచిన శిష్యుడని ఆమె వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల..నెల్లిమర్ల వద్ద ప్రసంగించారు. బొత్స రాజకీయాల్లో ఉన్నాడంటే పెన్మత్స సాంబశివరాజు చలవే అని, ఈ రోజు సాంబశివరాజు ఎవరని బొత్స ప్రశ్నిస్తున్నారని షర్మిల విమర్శించారు. అందుకే ఆయన గురువును 'ముంచిన' శిష్యుడయ్యాడని విపులీకరించారు.
జిల్లా ప్రజలు బొత్స కుటుంబం నుంచి ఏకంగా నలుగురిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటే వారు చేసింది శూన్యమని అన్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వ యంత్రాంగం బొత్స కుటుంబం కోసం పనిచేస్తోందని ఆమె ఆరోపించారు. ఇక, బొత్స అరాచకాల నుంచి కాపాడాలని మహిళలు కోరుతున్నారని షర్మిల చెప్పుకొచ్చారు.