: కపిల్ దేవ్ ఎదుగుదల వెనుక ప్రాణ్!
భారత క్రికెట్ చరిత్రలో కపిల్ దేవ్ లాంటి నిఖార్సైన ఆల్ రౌండర్ ఇప్పటిదాకా మరొకరు లభించలేదంటేనే అర్థమవుతోంది ఆ హర్యానా హరికేన్ ప్రతిభ ఎంతటిదో. ఆ పాటవం ఆయాచితంగా లభించింది కాదు. ఎంతో కఠిన శ్రమకోర్చి అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తిపతాకం రెపరెపలాడడం వెనుక ఈ లెజెండ్ కీలకపాత్ర పోషించాడు. 1983లో ప్రపంచకప్ నెగ్గడం ద్వారా ఉపఖండం జట్టుకు ప్రపంచ క్రికెట్ లో అనివార్యమైన స్థానం కల్పించాడు. అయితే, కపిల్ పురోగామి ప్రస్థానంలో బాలీవుడ్ దివంగత విలన్ ప్రాణ్ చలవ ఉందండోయ్. ఎలాగంటారా.. అయితే ఇది వినండి.
భారత క్రికెట్లో అప్పుడప్పుడే స్టార్ గా ఎదుగుతున్న కపిల్ మెరుగైన శిక్షణ కోసం ఆస్ట్రేలియా వెళ్ళాలనుకున్నాడు. కానీ, బీసీసీఐ చెప్పిన విషయం అతడిని నిర్ఘాంతపోయేలా చేసింది. ఆస్ట్రేలియా వెళ్ళాలంటే స్వంత ఖర్చులు పెట్టుకోవాలని పేర్కొంది. ఈ విషయాన్ని అప్పట్లో మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఆ వార్తలను చూసిన ప్రాణ్ మహాశయుడు వెంటనే బీసీసీఐకి ఓ ఘాటు లేఖ రాశాడు. 'కపిల్ ఖర్చులు మీరు భరించకపోతే నేను స్పాన్సర్ చేస్తా'నని స్పష్టం చేశాడు. దీంతో, బోర్డు దిగొచ్చి కపిల్ ఆస్ట్రేలియా ఖర్చులు భరించేందుకు తలూపింది. అదండీ, కపిల్ కు ప్రాణ్ సాయం కథాకమామీషూ!