: మోడీకి 'కుక్కపిల్ల' కష్టాలు
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 2002నాటి అల్లర్లకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు తాజాగా ఆయనకు ప్రతికూలంగా మారాయి. 'రాయిటర్స్' వార్తా సంస్థకు మోడీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గుజరాత్ అల్లర్లపై మాట్లాడుతూ, నాటి అల్లర్లకు తాను పశ్చాత్తాపం పడట్లేదని, తానే తప్పూ చేయలేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం తనకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కానీ ఒకే ఒక వ్యాఖ్య ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టింది.
నాటి అల్లర్లకు చింతిస్తున్నారా? అన్న ప్రశ్నకు మోడీ బదులిస్తూ.. 'కుక్కపిల్ల కారు కింద పడితే బాధపడతాం కదా?' అన్నారు. 'కారును వేరొకరు నడుపుతున్నా, మనం వెనుక సీట్లో కూర్చుని ప్రయాణిస్తున్న సమయంలో కుక్కపిల్ల కారు చక్రం కింద పడితే అది చాలా బాధకలిగిస్తుంద'ని అన్నారు. ముఖ్యమంత్రిగా కాక, ఒక మానవత్వం ఉన్న వ్యక్తిగా ఎక్కడ విషాదం జరిగినా బాధ కలుగుతుందని చెప్పారు. తాను హిందువుగా పుట్టానని, హిందూ జాతీయవాదినని స్పష్టం చేశారు. నాటి అల్లర్లలో 1,000 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.
అల్లర్లలో మరణించిన వారిని కుక్కపిల్లలతో పోల్చడం ఏమిటంటూ ఏఐసీసీ నేత అజయ్ మాకెన్ ప్రశ్నించారు. నాగరిక సమాజంలో ఇలాంటి మాటలకు చోటు లేదన్నారు. మోడీ తనకు తానే శత్రువుగా మారుతున్నారని విదేశాంగ మంత్రి ఖుర్షీద్ వ్యాఖ్యానించారు. ఇక, ముస్లింలు మోడీకి కుక్కపిల్లల్లా కనిపిస్తున్నారా? అంటూ సమాజ్ వాదీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోడీ మాటల్లో పశ్చాత్తాపం కనిపించడం లేదని సీపీఎం నాయకురాలు బృందా కారత్ అన్నారు. ఆయన ప్రధానైతే కష్టమేనని జనతాదళ్ యునైటెడ్ నేత శివానంద్ తివారీ వ్యాఖ్యానించారు. మోడీ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని వీరందరిపై బీజేపీ మండిపడింది. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు.