: సెల్లుంటే శారీరకంగా వీక్ అవుతాం!
మీ చేతిలో ఎప్పుడూ సెల్‌ఫోన్ ఉంటుందా... అయతే మీరు శారీరకంగా దృఢత్వాన్ని కోల్పోతున్నారన్నమాట. ఎందుకంటే ఎక్కువగా సెల్‌ఫోన్ వాడేవారికి శారీరకంగా దృఢత్వం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తాము నిర్వహించిన పరిశోధనలో అధికంగా సెల్‌ఫోన్ వాడేవారు తక్కువగా సెల్ వాడే వారికన్నా కూడా శారీరకంగా దృఢత్వాన్ని కోల్పోతున్నట్టు తేలిందని చెబుతున్నారు.
అమెరికా కెంట్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కళాశాల విద్యార్ధుల సెల్‌ఫోన్ వాడకాన్ని గురించి ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందుకోసం వీరు 300 పైగా కళాశాల విద్యార్ధుల సెల్‌ఫోన్ వాడకాన్నీ, శారీరక శ్రమ సామర్ధ్యాన్ని పరిశీలించారు. వీరి పరిశీలనలో రోజులో ఎక్కువగా సెల్‌ఫోన్ వాడేవారిలో శారీరక దృఢత్వం, చురుకుదనం తగ్గుతున్నట్టు గుర్తించారు. సెల్‌ను అధికంగా ఉపయోగించడం వల్ల శారీరక దృఢత్వం తగ్గుతున్నట్టు తమ పరిశోధనలో తేలినట్టు పరిశోధకులు చెబుతున్నారు. సెల్‌ఫోన్ తీసుకెళ్లినా కూడా శారీరక శ్రమ చేస్తూనే ఫోన్ ఉపయోగించవచ్చని వారు చెబుతున్నారు. రోజుకు 14 గంటల పాటు సెల్‌ఫోన్ ఉపయోగిస్తున్న కళాశాల విద్యార్ధుల్లో శారీరక దృఢత్వం చాలా తక్కువగా ఉందని, అదే రోజులో 90 నిముషాల పాటు మాత్రమే సెల్‌ఫోన్ ఉపయోగించేవారిలో శారీరక దృఢత్వం చాలా మెరుగ్గా ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న జాకబ్ బార్క్‌లీ, ఆండ్రూ లెప్‌లు మాట్లాడుతూ, సెల్‌ఫోన్ ఉపయోగించే తీరునుబట్టి ఒక వ్యక్తి ఆరోగ్యముప్పు స్థాయిని గుర్తించే అవకాశం ఉందని చెబుతున్నారు.