: అరుణుడిపైని సూక్ష్మజీవుల్ని భూమిపైకి తేనున్నారు!
త్వరలో అరుణగ్రహంపై సూక్ష్మజీవుల ఉనికిని గురించి పరిశీలించేందుకు నాసా సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా అంగారకుడిపైకి యాత్రను సిద్ధం చేస్తోంది. అసలు అంగారక గ్రహంపై జీవం ఉందా? లేదా? అనే విషయంపై ఎంతోకాలంగా ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూస్తోంది. నాసా నిర్వహిస్తున్న ఈ పరిశోధనతో ఎంతోకాలంగా అసక్తిగా ఎదురుచూస్తున్న అరుణగ్రహంపై జీవుల ఉనికిని గురించిన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తన తర్వాత అంగారక యాత్రలో అక్కడి సూక్ష్మజీవుల కోసం పరిశోధన చేపట్టనుంది. ఈ యాత్రలో భాగంగా అంగారక గ్రహంపైని కొన్ని నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకురానుంది. భారీ వ్యయంతో చేపట్టనున్న మార్స్ 2020 రోవర్ భూమికి దూరంగా ప్రాణి మనుగడను, గతంలో సూక్ష్మజీవుల ఉనికిపైనా శోధించనుంది. సూక్ష్మ జీవుల ఉనికికి సంబంధించి ఇటీవల కాలంలో జరిగిన కొన్ని పరిశోధనలు ఆశావహ ఫలితాలను అందించడంతో ఈ అంశంపై ప్రయత్నాలను నాసా మరింత ముమ్మరం చేసింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గతంలోని సూక్ష్మజీవుల ఉనికి కోసం నిర్వహించిన పరిశోధనలతోబాటు భవిష్యత్తులో మానవ యాత్రలకు అవసరమైన కొన్ని పరీక్షలను కూడా నాసా నిర్వహించనుంది.