: మహిళలకే మానసిక శక్తి ఎక్కువ
పురుషులకన్నా మహిళలకు ఒత్తిడిని తట్టుకునే మానసిక శక్తి ఎక్కువంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అయితే పురుషులకంటే స్త్రీలు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యాన్ని ఎక్కువగా కలిగివుంటారని పరిశోధకులు చెబుతున్నారు.
బఫెలో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఒత్తిడిని తట్టుకునే సామర్ధ్యానికి సంబంధించి పురుషులు, స్త్రీలపై పరిశోధనలు నిర్వహించారు. వీరి పరిశోధనలో పురుషులకన్నా స్త్రీలు ఒత్తిడిని తట్టుకోగలరని తేలింది. దీనికి కారణం మహిళల మెదడులో ఈస్ట్రోజెన్ హార్మోను విడుదల చేసే అరోమేటేజ్ అనే ఎంజైము అని వారి పరిశోధనలో తేలింది. ఈ ఎంజైము మహిళల్లో ఒత్తిడిని తట్టుకునే శక్తినిస్తోందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన జెన్‌యాన్ మాట్లాడుతూ స్త్రీలు దీర్ఘకాల ఒత్తిడిని సమర్ధవంతంగా తట్టుకోగలుగుతున్నట్టు గత అధ్యయనాల్లో తేలిందని, దీనికి కారణాన్ని కనుగొనేందుకు తాము ఎలుకలపై చేసిన పరిశోధనలో మగవాటికన్నా ఆడ ఎలుకలు మరింత ఒత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాయని, దీన్ని బట్టి మహిళలు మెదడులో ఈస్ట్రోజెన్ హార్మోను విడుదల చేసే అరోమేటేజ్ అనే ఎంజైము దీనికి దోహదం చేస్తున్నట్టు తమ పరిశోధనలో గుర్తించినట్టు యాన్ తెలిపారు.