: విద్యుత్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు గోపీ, సైనా ప్రచారం
రాష్ట్రంలో విద్యుత్ ఇక్కట్లు నానాటికి పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం అవగాహన చర్యలకు శ్రీకారం చుట్టింది. విద్యుత్ పొదుపుగా వాడాలంటూ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీ చంద్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ లతో ప్రచారం చేయించాలని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ ఎక్కువ అవుతున్న తరుణంలో పొదుపు చేయడమే మేలని గోపీ, సైనా అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ అధ్యక్షతన నిర్వహించిన ఓ అవగాహన కార్యక్రమంలో గోపీ, సైనా పాల్గొన్నారు. ప్రచార కార్యక్రమానికి తమ మద్దతు తెలిపిన వీరిరువురు, తమలాగే ప్రజలు కూడా విద్యుత్ ఆదా చేయాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న వినియోగదారుల్లో సగం మంది ఓ గంటపాటు ట్యూబ్ లైటును ఆపితే 400 మెగావాట్ల విద్యుచ్ఛక్తి పొదుపు చేయవచ్చని వారు పేర్కొన్నారు.