: తప్పులో కాలేసిన ఐక్యరాజ్యసమితి
అవును, నిజమే! ఐక్యరాజ్యసమితి తప్పులో కాలేసింది. అది కూడా భారత వాణిజ్య శాఖా మంత్రి పేరును గుర్తించడంలో. అమెరికా ఉన్నత వాణిజ్య ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆనంద్ శర్మ నేడు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితి పబ్లిక్ రిలేషన్స్ విభాగం బాన్ కీ మూన్ ను కలవనున్న కమల్ నాథ్ అంటూ ప్రకటన విడుదల చేసింది. ప్రకటనకు అనుబంధంగా విడుదల చేసిన ఆనంద్ శర్మ ఫోటో క్రింద కూడా కమల్ నాథ్ అంటూ పేరు రాసింది. అయితే జరిగిన పొరపాటు తెలుసుకున్న ఆ విభాగం, గౌరవ ప్రతినిధుల పేర్లను పంపించాల్సిన బాధ్యత ఐరాసలోని భారతీయ అధికారులదేనని స్పష్టం చేశారు. అయితే కమల్ నాథ్ ప్రస్తుతం పట్టణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్నారు. ఈయన 2009 వరకు వాణిజ్యశాఖా మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు.