: చిన్న వయసు... పెద్ద పదవి!
ఆ బుడతడి పేరు రాబర్ట్ బాబీ. పేరు చాలా ముద్దుగా ఉందికదూ... అయితే ఈ బుడతడు ఒక పట్టణానికి మేయరయ్యాడు. అది కూడా ఒకసారి కాదు, ఏకంగా రెండోసారి కూడా మేయరుగా ఎంపికయ్యేందుకు పోటీ పడుతున్నాడు.
అమెరికాలోని మిన్నెసోటాలో డోర్సెట్ అనే పట్టణానికి జరిగిన మేయర్ ఎన్నికల్లో రాబర్ట్ బాబీ మేయర్‌గా ఎన్నికయ్యాడు. ఈ పట్టణం చిన్నపాటిదే అయినా కూడా పర్యాటక ప్రాంతం కావడంతో అక్కడికి ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఎందుకంటే, ఆ చిన్న పట్టణంలో రకరకాల దేశాలకు సంబంధించిన ఆహారపదార్ధాలను వడ్డించే రెస్టారెంట్లు ఉంటాయి. దీంతో అక్కడికి వివిధ దేశాలకు సంబంధించిన పర్యాటకులు వస్తుంటారు. ఇకపోతే ఈ బుల్లి మేయరుగారు నిర్వహించాల్సిన బాధ్యతలు ఏమంటే ఇలా వచ్చే పర్యాటకులను ఆకర్షించడం, వారికి అభివాదం చేయడం వంటి చిన్న చిన్నవి మాత్రమే. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మేయరుగా ఎన్నికైన బాబీ మళ్లీ రెండోసారి కూడా పోటీ పడుతున్నాడట. ఈ మేయరుగారు నిర్వహించాల్సిన ఇతర విధులను నగరంలోని వ్యాపారస్తులే చూసుకుంటారట.