: కాల్షియంతో మెమరీ మెరుగవుతుంది
కాల్షియంతో ఎముకలు బలంగా తయారవుతాయి అనే విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఇదే కాల్షియం మన జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. కాల్షియం వల్ల మన మెదడులో మనం నేర్చుకున్న విషయాలు, అనుభవాలు చాలాకాలం పాటు భద్రంగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
జర్మనీలోని హైడెల్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన నాడీ జీవశాస్త్ర నిపుణులు మెదడు పనితీరు, జ్ఞాపకశక్తికి దారితీసే సంకేతాలపై అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో మెదడులోని న్యూరాన్లలో ఉండే కాల్షియం దీర్ఘకాల జ్ఞాపకశక్తికి కారణమవుతున్నట్టు వారు గుర్తించారు. ఏదైనా కొత్త విషయాలను నేర్చుకునే సమయంలో న్యూరాన్లలో జరిగే మార్పులను వారు తమ అధ్యయనంలో గమనించారు. ఇందుకోసం ఎలుకలు, కీటకాలు వంటి వాటిపై ప్రయోగాలు నిర్వహించారు. ఈ ప్రయోగాల్లో కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు న్యూరాన్ల కాల్షియం స్థాయిల్లో మార్పులను గమనించారు. జ్ఞాపకశక్తికి అవసరమయ్యే రసాయన చర్యకు, ప్రోటీన్ల ఉత్పత్తి నియంత్రణకు ఈ మార్పులు కారణమవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. న్యూరాన్లలోని కాల్షియం పంపే సంకేతాల వల్లే మనం నేర్చుకున్న అనేక కొత్త విషయాలను మెదడులో దీర్ఘకాలం పాటు భద్రంగా ఉంటాయనే విషయం తమ పరిశోధనలో తేలినట్టు పరిశోధకులు చెబుతున్నారు.