: రెండు జబ్బులకు ఒకే మందు!
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా రెండు జబ్బులకు ఒకే మందుతో చికిత్స చేయగలమా...? ఏమో ఒకే మందు రెండు జబ్బులకు పనిచేస్తుందేమో... ఎందుకంటే, అలా ఒకే మందు రెండు జబ్బులను నయం చేసేందుకు ఉపకరిస్తున్నట్టు పరిశోధకుల పరిశోధనలో తేలింది. లుకేమియాకు సంబంధించిన మందును రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడితే చక్కగా పనిచేస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
వాల్టర్, ఎలీజా హాల్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక పరిశోధనలో రొమ్ము క్యాన్సర్ వ్యాధిని నయం చేయడంలో లుకేమియాకు సంబంధించిన మందు చక్కగా పనిచేస్తున్నట్టు తేలింది. బీహెచ్3-మిమెటిక్స్ అనే మందును రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వాడే టామోక్సిఫెన్‌ను కలిపితే కొన్ని రకాల రొమ్ము క్యాన్సర్లకు చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్లలో ఈస్ట్రోజెన్ రెసెప్టార్-పాజిటివ్ అనే రకం ఎక్కువగా వస్తుంటుంది. ఈ తరహా క్యాన్సర్లలో ఇది సుమారు 70 శాతం ఉంటుంది. అయితే దీనికి చికిత్సగా బీహెచ్3-మిమిటెక్స్, టామోక్సిఫెన్ అనే మందులు పనిచేస్తాయని ఈ ప్రయోగంలో పాల్గొన్న జెఫ్ లిండ్‌మన్ తెలిపారు. వీరు ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ రెండు మందులను మిశ్రమాన్ని ఉపయోగించడంతో కణితి వృద్ధి ఆగిపోవడం లేదా పూర్తిగా నయం కావడం జరిగిందని తెలిపారు. రొమ్ము క్యాన్సర్ నివారణలో ఈ రెండు మందులు చక్కగా పనిచేస్తున్నట్టు తమ పరిశోధనలో స్పష్టమైందని, బీహెచ్3-మిమిటెక్స్ ఒక్కదానితోనే సమర్ధవంతమైన చికిత్స సాధ్యం కాదని, దీన్ని రొమ్ము క్యాన్సర్ కోసం చాలా కాలంగా ఉపయోగిస్తున్నా టామోక్సిఫెన్‌తో కలిపినప్పుడే చక్కటి ఫలితాలను పొందడం సాధ్యమవుతుందని లిండ్‌మన్ తెలిపారు. ఈ మందు ఇతర రకాల కణితి ఆధార క్యాన్సర్లపై కూడా ప్రభావం చూపుతుందని లిండ్‌మన్ చెబుతున్నారు.