: ఎవరిని అడిగి షెడ్యూల్ ఖరారు చేశారు?: సఫారీ క్రికెట్ బోర్డుపై బీసీసీఐ గరం
ఈ ఏడాది చివర్లో భారత్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళాల్సివుండగా.. సఫారీ క్రికెట్ బోర్డు తమను సంప్రదించకుండానే షెడ్యూల్ ప్రకటించిందని బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుకు తన అభ్యంతరాన్ని తెలియజేసింది. మ్యాచ్ ల సంఖ్య తగ్గించాలని బీసీసీఐ ఈ సందర్భంగా సఫారీ బోర్డును కోరింది. నిన్న వెల్లడించిన టూర్ షెడ్యూల్ ప్రకారం భారత జట్టు జనవరి 19 వరకు దక్షిణాఫ్రికాలో ఉండాలి. అయితే, జనవరి 25న న్యూజిలాండ్ పర్యటనకు వెళ్ళాల్సి ఉంది. రెండు పర్యటనలకు మధ్య వ్యవధి తక్కువగా ఉండడంతో న్యూజిలాండ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు టీమిండియాకు సమయం లభించదని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి.
అందుకే, దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ను ఐదు వన్డేలకు పరిమితం చేయాలని సఫారీ బోర్డుకు సూచించారు. ఇంతకుముందు ఏడు వన్డేల సిరీస్ ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా పర్యటన షెడ్యూల్లో సవరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు రెండు దేశాల బోర్డులు ప్రయత్నాలు ఆరంభించాయని తెలిపారు.