: వానపాములు చెప్పే వేల ఏళ్ల కథలు!
కొన్ని వేల సంవత్సరాల కాలంలో భూమి ఎలా ఉండేది? భూమిపై వాతావరణ పరిస్థితులు ఎలా ఉండేవి? అనే విషయాన్ని తెలుసుకునేందుకు వానపాములు తోడ్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎవరికీ ఎలాంటి హానీ కలిగించకుండా, రైతన్నకు నేస్తాలుగా చెప్పుకునే వానపాములు మట్టిలో ఉంటూ వ్యర్థాలను వదులుతుంటాయి. అయితే ఈ వానపాములు వదిలే వ్యర్ధాల ద్వారా వేల ఏళ్ల నాటి వాతావరణ పరిస్థితులను గురించి అంచనా వేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
రీడింగ్ యార్క్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు వానపాములు వదిలే వ్యర్ధాల ద్వారా గత కాలంలోని వాతావరణాన్ని గురించి అంచనా వేయవచ్చని చెబుతున్నారు. వీరు నిర్వహించిన పరిశోధనల్లో వానపాములు వెలువరించే కాల్షియం కార్బొనేట్ ఉండలు ఉష్ణోగ్రత వివరాల్ని అందజేస్తాయని, వీటి ద్వారా వేల ఏళ్ల సంవత్సరాల నాటి వాతావరణ పరిస్థితుల్ని గురించి విశ్లేషించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ప్రయోగశాల అధ్యయనం ద్వారా వీరు ఈ విషయాన్ని గుర్తించారు. కాల్షియం ఉండలకు గతకాల వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని అందించే సామర్ధ్యం ఉందనీ, దీని ద్వారా వాతావరణ మార్పుల నమూనాలకు ప్రమాణాల్ని రూపొందించుకోవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ ఎమ్మా వెర్ట్సీగ్ చెబుతున్నారు.