: ఎదురు తిరిగిన వారిపై దాడులు కేసీఆర్ కు అలవాటే: కేఎస్ రత్నం
తనకు ఎదురుతిరిగిన వారెవరైనా వారిపై పార్టీ కార్యకర్తలను ఉసిగొల్పి దాడులకు పాల్పడడం కేసీఆర్ కు అలవాటేనని టీడీపీ నేత కేఎస్ రత్నం అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కు అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ కోరడం ఇష్టం లేదన్నారు. అందరూ తెలంగాణ డిమాండ్ చేస్తుండడంతో కేసీఆర్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదన్నారు. అందుకే తన ఆలోచనలకు విరుద్దంగా ఎవరు మాట్లాడినా వారిపై దాడులకు పాల్పడేందుకు టీఆర్ఎస్ ముందుకొస్తుందన్నారు. అందులో భాగంగా తమ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహుల్ని హత్య చేయించేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నాడని ఆయన ఆరోపించారు. గతంలో మందకృష్ణ, రవీంద్ర నాయక్, చింతా స్వామి, గద్దర్ లపై దాడులు చేయించిన ఉందంతాలను ఈ సందర్భంగా కేఎస్ రత్నం గుర్తు చేశారు.