: ఎంఆర్‌ఐ స్కానింగ్‌తో క్యాన్సర్‌ను గుర్తించొచ్చు!


క్యాన్సర్‌ వ్యాధిని గుర్తించేందుకు రేడియో ధార్మిక పరీక్షలు చేయాల్సిన అవసరం లేదని, కేవలం ఎంఆర్‌ఐ స్కానింగ్‌ ద్వారా కూడా క్యాన్సర్‌ కణితులను గుర్తించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు క్యాన్సర్‌ కణితులను గుర్తించేందుకు చక్కెర బాగా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇది చాలా చవకైన పద్ధతికూడా. క్యాన్సర్‌ నిర్ధారణ కోసం రోగులు పెద్ద పెద్ద ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం భవిష్యత్తులో ఉండబోదని, సాధారణ ఆసుపత్రుల్లో సైతం క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ప్రస్తుతం వాడుకలో ఉన్న రేడియో ధార్మిక పరీక్షలకు ప్రత్యామ్నాయంగా, ఒక నూతన సురక్షితమైన, సరళమైన పరీక్షా పద్ధతిని కనుగొన్నారు. ఈ పద్ధతి క్యాన్సర్‌ కణితులను నిర్ధిష్టంగా గుర్తించడంలో రేడియాలజిస్టులకు చాలా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. ఈ కొత్త పద్ధతిని 'గ్లూకోజ్‌ కెమికల్‌ ఎక్స్‌ఛేంజ్‌ శాచురేషన్‌ ట్రాన్స్‌ఫర్‌ (గ్లూకోసెస్ట్‌)'గా వ్యవహరిస్తున్నారు. సాధారణ ఆరోగ్యవంతమైన కణజాలంతో పోలిస్తే క్యాన్సర్‌ కణితులు తమ వృద్ధి కోసం గ్లూకోజ్‌పై ఎక్కువగా ఆధారపడతాయనే అంశం ఆధారంగా ఈ పరీక్షా ప్రక్రియను శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరీక్షలో రేడియో తరంగాలు శరీరంలోని గ్లూకోజ్‌ను అయస్కాంత శక్తిద్వారా గుర్తిస్తాయని, దీని ద్వారా క్యాన్సర్‌ కణితులను సంప్రదాయ ఎంఆర్‌ఐ పరీక్షల ద్వారా గుర్తించవచ్చని ఈ పరిశోధనలో పాల్గొన్న డాక్టర్‌ సైమన్‌ వాకర్‌ శామ్యూల్‌ చెబుతున్నారు. ఈ పద్ధతిలో సాధారణంగా షుగర్‌ను ఇంజక్షన్‌ ఇవ్వడం ద్వారా చాలా చవకగా, సురక్షిత పద్ధతిలో క్యాన్సర్‌ కణితులను గుర్తించవచ్చని, రేడియో ధార్మిక పదార్ధాలను ఇంజక్షన్‌ చేయాల్సిన అవసరం ఉండదని, ఈ పద్ధతిద్వారా ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో క్యాన్సర్‌ కణితులు చక్కెర కారణంగా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయమని సైమన్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News