: విటమిన్ సప్లిమెంట్లు ఆయుష్షు తగ్గిస్తాయట!
విటమిన్లు మన శరీరానికి అవసరమైన పోషణను అందించడంలో చక్కగా ఉపయోగపడతాయి. అయితే మన దైనందిన ఆహారంతోబాటు అదనంగా సప్లిమెంట్ల రూపంలో తీసుకునే విటమిన్ల వల్ల ప్రయోజనం సంగతి పక్కనపెడితే మన ఆయుష్షును కూడా తగ్గిస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. తమ పరిశోధనల్లో చిన్న చిన్న క్షీరదాల్లో విటమిన్ ఇ, మరియు 'సి'లు తీసుకోవడం వల్ల అవి అనుకూలం కన్నా ప్రతికూల ప్రభావానే ఎక్కువగా చూపినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గ్లాస్గ్కో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సప్లిమెంట్లుగా తీసుకునే విటమిన్ల ప్రయోజనంపై కొన్ని సందేహాలున్నట్టు చెబుతున్నారు. తాము చేసిన పరిశోధనల్లో చిన్న చిన్న క్షీరదాల్లో సి, ఇ విటమిన్లు వాటి ఆయు:ప్రమాణాన్ని తగ్గించినట్టు స్పష్టమైందని వారు తెలిపారు. నదులు, చెరువుల తీరాల్లోను, ఎక్కువగా వ్యవసాయ క్షేత్రాల్లోను బొరియల్లో నివసించే ఎలుకలు వంటి క్షీరదాలపై తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎలుకలకు తాము విటమిన్ సి, ఇ ఉండే సప్లిమెంట్లను అందజేశామని, ఇందుకోసం తాము రెండు నెలలున్న వాటిని ఎంపిక చేసుకున్నామని, వీటిని రెండు బృందాలుగా విడదీసి వాటిలో ఒక బృందానికి సాధారణ ఆహారంతోబాటు విటమిన్లను అందించామని, మిగిలిన వాటికి మామూలు ఆహారాన్నే ఇచ్చామని చెప్పారు. విటమిన్ సప్లిమెంట్లను తీసుకున్న వాటిలో విటమిన్ ఇ ఇచ్చిన వాటి ఆయుప్రమాణం 11 శాతం తగ్గగా, విటమిన్ సి ఇచ్చిన వాటి ఆయుష్షు మిగిలిన వాటితో పోల్చితే ఏకంగా 11-26 శాతం తగ్గినట్టు పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి అదనంగా సప్లిమెంట్లను వాడకుండా చక్కటి పోషకాహారం తీసుకోవడమే ఎంతోమేలు.